‘హోరా హోరి’తో తెలుగులోకి అడుగుపెట్టిన దక్షా నగార్కర్‌. ‘హుషారు’, ‘జాంబీరెడ్డి’, ‘బంగార్రాజు’ తదితర చిత్రాలతో అలరించింది.

ఇటీవల ఆమె రవితేజతో కలిసి ‘రావణాసుర’లో నటించింది. ఈ సందర్భంగా దక్ష మాట్లాడుతూ.. తొలి సినిమా చేస్తున్నప్పుడు నా వయసు పదిహేనేళ్లు.

అప్పుడు ఏ రకమైన సినిమాలు చేయాలి, ఎలా ప్రయాణం చేయాలనే విషయంలో సరైన స్పష్టత ఉండేది కాదు.

చిత్రసీమలో ప్రతి రోజూ నేర్చుకోవల్సిందే. చిన్న వయసులోనే కెరీర్‌ మొదలుపెట్టా. ప్రతి సినిమాతోనూ కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నా.

‘రావణాసుర’ యాక్షన్‌తో కూడిన ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా. నా పాత్ర ఏమిటి? నేనెంత సేపు కనిపిస్తాననే విషయాల గురించి ఇప్పుడేమీ చెప్పలేను.

రవితేజతో కలిసి ప్రయాణం చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన సెట్లో అందరితో సరదాగా ఉంటారు.

నటించేటప్పుడు కూడా మెథడ్‌ యాక్టింగ్‌, పాత్రకి తగ్గట్టుగా మారిపోతుంటారు. అందరు హీరోలతోనూ కలిసి నటించాలని ఉంది.

తెలుగులో ఎన్టీఆర్‌ అంటే ఇష్టం. ఆయనకి భాషపై పట్టు, ఆయన సంభాషణలు చెప్పే విధానం నాకు బాగా నచ్చుతుంది. వ్యక్తిగతంగా ఆయన్ని అభిమానిస్తా’’.