48 ఏళ్ల భారత రికార్డ్‌ను బ్రేక్ చేసిన శ్రీలంక.. అదేంటో తెలుసా?

31 March 2024

TV9 Telugu

చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్, శ్రీలంక (BAN vs SL) మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 

రెండో రోజు శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 531 పరుగుల వద్ద ముగిసింది. శ్రీలంక ఇన్నింగ్స్ సమయంలో, ఏ బ్యాట్స్‌మెన్ సెంచరీ చేయలేకపోయాడు. అయినప్పటికీ జట్టు 500 కంటే ఎక్కువ పరుగులు చేయడంలో విజయం సాధించింది. 

తద్వారా ఇప్పటి వరకు భారత్ పేరిట ఉన్న టెస్టు మ్యాచ్‌లో ఎలాంటి సెంచరీ లేకుండా ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు సాధించిన రికార్డును శ్రీలంక తన ఖాతాలో వేసుకుంది.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 314/4 స్కోరు చేసింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఔటైన నలుగురు బ్యాట్స్‌మెన్‌లలో ముగ్గురు హాఫ్ సెంచరీలు చేసినా ఒక్కరు కూడా సెంచరీ చేయలేకపోయారు. 

నిషాన్ మదుష్క 57 పరుగులతో, దిముత్ కరుణరత్నే 86 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. కాగా, కుశాల్ మెండిస్ 93 పరుగులు చేశాడు. రెండో రోజు దినేష్ చండిమాల్ 59 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 

అదే సమయంలో కెప్టెన్ ధనంజయ్ డిసిల్వా 70 పరుగులు, కమిందు మెండిస్ నాటౌట్ 92 పరుగులు చేశారు. అలాగే, కమిందు ఒక ఎండ్‌లో నిలిచినా సెంచరీ చేసే అవకాశం మిస్సైంది.

ఈ విధంగా, శ్రీలంక ఇన్నింగ్స్‌లో ఏ బ్యాట్స్‌మెన్ కూడా సెంచరీ చేయలేకపోయాడు, కానీ ఈ క్రమంలో భారత రికార్డును బద్దలు కొట్టింది. 

1976లో, న్యూజిలాండ్‌తో జరిగిన కాన్పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 524/9 స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇది ఇప్పటివరకు ఒక్క సెంచరీ లేకుండానే అత్యధిక టెస్ట్ స్కోరుగా నిలిచింది. 

భారత ఇన్నింగ్స్‌లో ఆరుగురు బ్యాట్స్‌మెన్ హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ వారి ఇన్నింగ్స్‌ను ఎవరూ సెంచరీగా మార్చలేకపోయారు. మొహిందర్ అమర్‌నాథ్ అత్యధిక స్కోరు 70 పరుగులు.