షార్జాలో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా పరిస్థితి మరీ దారుణంగా మారింది.
ప్రొటీస్ జట్టు 33.3 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌటైంది. ఆఫ్ఘనిస్థాన్ బౌలర్లు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ఏమాత్రం నిలదొక్కుకోనివ్వలేదు.
అఫ్గానిస్థాన్ తరపున రషీద్ ఖాన్, ఫజల్‌హక్ ఫరూఖీ, 18 ఏళ్ల యువ బౌలర్ అల్లా ఘజన్‌ఫర్ అద్భుత ప్రదర్శన చేశారు. ఈ ముగ్గురు బౌలర్లు కలిసి సౌతాఫ్రికాను చిత్తు చేశారు.
దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 17 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా ఎప్పటికీ కోలుకోలేకపోయింది.
టాప్ ఆర్డర్ అంతా విఫలమయ్యారు. ట్రిస్టన్ స్టబ్స్, జాసన్ స్మిత్ ఖాతా కూడా తెరవలేదు. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రీజా హెండ్రిక్స్ 12 బంతుల్లో 9 పరుగులు చేసి ఔటయ్యాడు.
కాగా, టోనీ డి జార్జి 11 పరుగులు చేశాడు. కేవలం 5 బంతుల్లోనే 2 పరుగులు చేసి కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ కూడా ఔటయ్యాడు.
సౌతాఫ్రికా 36 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. వియాన్ ముల్డర్ 84 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 52 పరుగులు చేశాడు.
దీంతో ఆ జట్టు స్కోరు 106కు చేరుకుంది. ముల్డర్ ఈ ఇన్నింగ్స్ ఆడకపోతే దక్షిణాఫ్రికా 50 పరుగులకే కుప్పకూలడం ఖాయం.
18 ఏళ్ల యువ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ ఆఫ్ఘనిస్తాన్‌కు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 10 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో పాటు ఫజల్‌హక్ ఫరూఖీ 7 ఓవర్లలో 35 పరుగులిచ్చి 4 వికెట్లు, రషీద్ ఖాన్ 80 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు.