TV9 Telugu

15 March 2024

ఐపీఎల్ జీతంతో అమ్మకు నగలు, నాన్న అప్పులు తీర్చేశా..

ఐపీఎల్ 2024కు రంగం సిద్ధమైంది. మార్చి 22 నుంచి 17వ సీజన్ మొదలుకానుంది. తొలి మ్యాచ్‌లో బెంగళూరు వర్సెస్ చెన్నై జట్లు తలపడనున్నాయి.

ఇటీవలి కాలంలో టీమిండియాలో అరంగేట్రం చేసిన ఆటగాళ్లకు ఐపీఎల్ కొత్త సీజన్ చాలా ప్రత్యేకమైనది. వారిలో ఒకరు ధృవ్ జురెల్.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ జురెల్ ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇప్పుడు జురెల్ ఐపీఎల్‌లో తన ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ కోసం మైదానంలోకి దిగనున్నాడు. అక్కడ అతను గత సీజన్ కంటే మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నాడు.

సీజన్ ప్రారంభానికి ముందు, జురెల్ కీలక విషయాలు బహిర్గతం చేశాడు. ఇది ఎవరినైనా భావోద్వేగానికి గురి చేస్తుంది. అతనికి సెల్యూట్ చేయాలనిపిస్తుంది.

ఈ 23 ఏళ్ల క్రికెటర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కుటుంబం చేసిన అప్పును తీర్చడానికి IPL నుంచి తన మొదటి జీతం ఉపయోగించానని తెలిపాడు.

అంతేకాదు, దానితో తల్లికి కొత్త నగలు కూడా కొనిచ్చాడు. తన ఆభరణాలను అమ్మి క్రికెట్ కిట్ కొనుగోలు చేసిన జురెల్ కలను నెరవేర్చడంలో అతని తల్లి పెద్ద సహకారం అందించింది.

2022 మెగా వేలంలో జురెల్‌ను రూ. 20 లక్షల బేస్ ధరకు రాజస్థాన్ కొనుగోలు చేసింది. కానీ నిబంధనల ప్రకారం, అతని అంతర్జాతీయ అరంగేట్రం తర్వాత బేస్ ధర రూ. 50 లక్షలకు పెరుగుతుంది.