బాబోయ్ బంగారం.. అందుకోలేని ఎత్తుకు పెరుగుతున్న ధరలు..

24 October 2023

గత వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెబ్‌సైట్ దీనికి సంబంధించిన వివరాలు ఇచ్చింది.

గత వారం ప్రారంభంలో, అంటే అక్టోబర్ 16న, బంగారం రూ.59,037 వద్ద ఉంది. ఇది ఇప్పుడు అక్టోబర్ 21న 10 గ్రాములకు రూ.60,693కి చేరుకుంది. అంటే ఈ వారం దీని ధర రూ.1,656 పెరిగింది.

వెండి కూడా రూ.72 వేలకు చేరింది. గత వారం వెండి ధర వెయ్యి రూపాయలకు పైగా పెరిగింది. ఈ వారం ప్రారంభంలో రూ.70,572 ఉండగా, ప్రస్తుతం కిలో రూ.71,991కి చేరింది. అంటే దీని ధర రూ.1,419 పెరిగింది.

అక్టోబర్‌లో ఇప్పటివరకు బంగారం ధర రూ.2,900 కంటే ఎక్కువ పెరిగింది. అక్టోబర్ నెలలో ఇప్పటివరకు బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగాయి.

ఈ నెలలో ఇప్పటివరకు బంగారం ధర రూ.2,974 పెరిగింది. ఈ నెల ప్రారంభంలో అంటే అక్టోబర్ 1న 10 గ్రాములు రూ.57,719 ఉండగా, ప్రస్తుతం రూ.60,693కి చేరింది. వెండి కిలో రూ.71,603 నుంచి రూ.71,991కి పెరిగింది

బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. మొదటిది దసరా దీపావళి పండుగ సీజన్ కావడంతో ఇన్వెస్ట్మెంట్స్ కోసం షాపింగ్ కోసం బంగారం డిమాండ్ పెరిగింది

అమెరికాలో పెంచుతున్న వడ్డీరేట్లు ఇకపై ఆగిపోతాయని మార్కెట్ భావిస్తోంది. బంగారానికి ఇదే అతిపెద్ద సానుకూల సంకేతంగా మారింది. అలాగే, బాండ్ ఈల్డ్‌లు పడిపోవడం, డాలర్ పెరుగుదల ఆగిపోవడం కూడా ఇందుకు కారణాలు

దేశీయ మార్కెట్‌లో పండుగలకు డిమాండ్ పెరుగుతుంది. ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్‌ మొదలవుతుంది. డిమాండ్ పెరుగుదల ధరలను ప్రభావితం చేస్తుంది. దీంతో దీపావళి నాటికి బంగారం 62 వేలకు, వెండి 75 వేలకు చేరుకోనే అవకాశం ఉంది.