పాత ప్రాపర్టీకి బ్యాంకు లోన్ కావాలంటే ఇవన్నీ ఉండాల్సిందే

24 September 2023

అందుబాటు ధరలో ఉందని పాత ఇల్లు కొనాలని అనుకుంటున్నారా? లోన్ వస్తుందా అనే డౌట్ ఉందా? అయితే ఇది మీకోసమే.

హోమ్ లోన్ కోసం ఇల్లు పాతదా? కొత్తదా అనే రూల్ ఏమీ లేదు. ఎటువంటి ప్రాపర్టీ కైనా లోన్ ఇస్తారు. అయితే, లోన్ ఎంత ఇస్తారు? ఎలా ఇస్తారు అనే విషయాలపై ప్రభావం చూపించే అంశాలు కొన్ని ఉన్నాయి. అవి తెలుసుకుందాం.

హోమ్ లోన్ ఇవ్వాలంటే.. కొనాలనుకునే ఇల్లు ఉన్న ప్రాంతం.. ప్రస్తుత కండిషన్ లెండర్స్ చూస్తారు. మీరు కొనాలనుకుంటున్న ఇల్లు లోకల్ అథారిటీస్ నుంచి అన్ని ఆమోదాలు పొందినదై ఉంటె లోన్ ఇవ్వడానికి వెనుకాడరు.

లోన్ మొత్తం ఎంత అని నిర్ధారించడానికి ప్రాపర్టీ ఏజ్ ఎటువంటి ప్రభావం చూపించదు . లోన్ ఆమోదం ముఖ్యంగా రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఒకటి ప్రాపర్టీ మార్కెట్ విలువ, రెండు కొనుక్కునే వారి ఆర్ధిక స్థితి. అలాగే కొనుక్కునే వారి సిబిల్ స్కోర్ తప్పనిసరిగా చూస్తారు.

ఇల్లు కొనుక్కునే వారి క్రెడిట్ హిస్టరీ, లోన్ తిరిగి చెల్లించగల సామర్థ్యం ఎంత ఉంది, అలాగే వారి వయస్సు ఆధారంగా లోన్ ఎమౌంట్ నిర్ణయిస్తారు.

లోన్ ఇచ్చే ముందు లీగల్ గా అన్ని అంశాలను పరిశీలిస్తారు. ప్రతి పేపర్ వాల్యుయేట్ చేస్తారు. దీనికోసం బ్యాంకులకు ప్రత్యేకంగా లీగల్ టీమ్స్ ఉంటాయి.

కొన్ని బ్యాంకులకు నిర్మాణ రంగ నిపుణులు కూడా వారి ప్యానెల్ లో ఉంటారు. లోన్ సాంక్షన్ చేసే ముందు వేల్యూ చెక్ చేయిస్తాయి. అన్ని అంశాలు సరిగా ఉంటె.. పాత ప్రాపర్టీ అయినా 85% వరకూ లోన్ ఇస్తాయి బ్యాంకులు.