చలికాలంలో శరీరాన్ని స్వెటర్లు, క్యాప్‌లతో కప్పేసినా చర్మం పొడిబారి నిర్జీవంగా మారడం, పెదాలు, పాదాల పగుళ్లు, పొడిబారిన జుట్టు వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.

మరి ఇలాంటి వాతావరణ పరిస్థితుల నుంచి మన చర్మాన్ని సంరక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు.

ఎలాంటి రసాయనాలు లేకుండా సహజమైన పదార్థాలతో తయారు చేసే ఆర్గానిక్ సోప్‌ని మాత్రమే స్నానానికి ఉపయోగించాలి.

అలాగే గోరు వెచ్చటి నీటిలో కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది.

స్నానం పూర్తయిన తర్వాత టవల్‌తో చర్మాన్ని మృదువుగా తుడవాలి. అదే పనిగా గట్టిగా రుద్దితే చర్మం పాడైపోతుంది.

ఆ తర్వాత శరీరాన్ని మాయిశ్చరైజ్‌ చేయాలి. ఇందుకోసం స్వచ్ఛమైన పాలను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఈ క్రమంలో మృదువైన మస్లిన్‌ వస్త్రాన్ని తీసుకుని పాలలో ముంచి దానిని చర్మంపై మెల్లగా అద్దాలి. ఆ తర్వాత సుమారు 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి.