మోకాలి పొడవు కుర్తీలు వేస్తే.. మంచి వరుడు వస్తాడు

Girls With Kurtis, మోకాలి పొడవు కుర్తీలు వేస్తే.. మంచి వరుడు వస్తాడు

ఫ్యాషన్‌ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో కాలేజీ యూత్‌ డ్రెస్సింగ్ స్టైల్‌లకు హద్దు లేకుండా పోతోంది. అయితే ఇష్టానుసారంగా డ్రెస్‌లు వేసుకుంటున్న అమ్మాయిల పద్ధతికి అడ్డుకడ్డ వేయాలని భావించింది హైదరాబాద్ బేగంపేటలో ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీ. దీంతో మోకాళ్ల కింద వరకు ఉన్న కుర్తీలు వేసుకురావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆగష్టు 1న ఇది అమలులోకి వస్తుందని.. డ్రెస్సులు అలా లేని పక్షంలో కాలేజీకి అనుమతించమని యాజమాన్యం పేర్కొంది. అయితే దీన్ని నిరసిస్తూ గత శుక్రవారం వంద మంది స్టూడెంట్‌లు తమ నిరసనను వ్యక్తపరిచారు. అయినా ఈ నిర్ణయంపై కాలేజీ యాజమాన్యం వెనక్కి తగ్గలేదు.

ఈ నేపథ్యంలో మోకాలి పొడవు కుర్తీలు వేసుకురాని 30మందిని గురువారం కాలేజీ యాజమాన్యం ఇంటికి పంపింది. వారి ధరించిన దుస్తులు మోకాలి పొడవుకు కాస్త తక్కువ ఉన్నా యాజమాన్యం ఒప్పుకోలేదు. అయితే దీన్ని విద్యార్థులు ఖండిస్తున్నారు. డ్రెస్సింగ్ విషయంలో ఇలాంటి నిబంధనలు ఏంటని..?, వెస్ట్రన్ డ్రెస్సుల్లోనూ ఇబ్బందిగా లేనివే తాము వేసుకుంటామని.. కానీ కేవలం కుర్తీలే వేసుకురావాలని చెప్పడం చాలా దారుణమని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై మాట్లాడేందుకు తాము లెక్చరర్‌ల దగ్గరికి వెళ్తే.. ‘‘మన సంప్రదాయాన్ని మర్చిపోకూడదు’’.. ‘‘మోకాళ్ల పొడవు కుర్తీలు వేసుకుంటే మంచి వరుడు’’ వస్తాడు అంటూ అర్థం పర్థం లేని సమాధానాలు చెప్తున్నారని వారు అంటున్నారు. ఇక దీనిపై ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. తాము కాలేజీలోకి వచ్చేటప్పుడు గేట్ దగ్గర ఒక పురుష సెక్యురిటీ ఉన్నాడని.. మేము మోకాలి పొడవు డ్రెస్సులు వేసుకున్నామా..? లేదా..? అని అతడు పై నుంచి కిందికి చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *