మరోసారి దుమ్మురేపిన వార్నర్… సిడ్నీ స్టేడియంలో ‘బుట్ట బొమ్మ’ పాటకు డ్యాన్స్‌తో రచ్చ..

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చి అల వైకుంఠపురం సినిమాలో ‘బుట్ట బొమ్మ’ పాట ఎంత సెన్షేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

  • Shiva Prajapati
  • Publish Date - 7:42 pm, Sat, 28 November 20

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురం సినిమాలో ‘బుట్ట బొమ్మ’ పాట ఎంత సెన్షేషన్ అయ్యిందో అందరికీ తెలిసిందే. టిక్‌ టాక్ వేదికగా ఈ పాటకు ఎంతో మంది డ్యాన్స్ వేసి తమ ప్రతిభను కనబరచడంతో పాటు ఆ పాటపై తమ అభిమానాన్ని కనబరిచారు. ముఖ్యంగా ఈ పాట దేశాలే కాకుండా ఖండాలు సైతం దాటి ఆ ప్రాంత ప్రజల నోట వినిపించి కనువిందు చేసింది. ‘బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా..’ అంటూ ఎంతో మంది విదేశీ యువతీ యువకులు ఈ పాటను పాడటంతో పాటు డ్యాన్సులు కూడా చేసి సంబంధిత వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ వార్నర్ దంపతులు ఈ పాటతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. వార్నర్‌కు ఈ పాట అంటే ఎంతో ఇష్టం. తన భార్యతో కలిసి ‘బుట్ట బొమ్మా.. బుట్ట బొమ్మా..’ అంటూ స్టెప్పులేసి వావ్ అనిపించాడు. అప్పుడు వార్నర్ దంపతుల డ్యాన్స్ ఎంత వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

మళ్లీ ఇప్పుడు అదే పాటతో వార్నర్ హల్‌చల్ చేశాడు. అయితే ఈసారి క్రికెట్ గ్రౌండ్‌లోనే డ్యాన్స్ చేసి రచ్చ చేశాడు. శుక్రవారం నాడు సిడ్నీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వార్నర్.. బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులను కనువిందు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తుంది. మరి ఆ వీడియోను మీరూ చూసేయండి.