దుబ్బాక దంగల్ లో పొలిటికల్ హీట్

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో వేడి రాజుకుంది. పార్టీల మధ్య విమర్శలు తీవ్రమయ్యాయి. అటు అధికార టీఆర్ఎస్, ఇటు విపక్ష కాంగ్రెస్, బీజేపీల నేతలు మ్మెత్తిపోసుకుంటున్నారు.

దుబ్బాక దంగల్ లో పొలిటికల్ హీట్
Follow us

|

Updated on: Oct 24, 2020 | 3:17 PM

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో వేడి రాజుకుంది. పార్టీల మధ్య విమర్శలు తీవ్రమయ్యాయి. అటు అధికార టీఆర్ఎస్, ఇటు విపక్ష కాంగ్రెస్, బీజేపీల నేతలు మ్మెత్తిపోసుకుంటున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ ప్రత్యర్థులు బలబలాలపై మరింత స్పష్టత రావడంతో విమర్శలు కూడా అనుకున్న లక్ష్యాన్ని మిస్ కాకుండా ఛేదించేలాగా కొనసాగుతున్నాయి.

‘కాంగ్రెస్, బీజేపీ రెండూ దొందే. తెలంగాణ అభివృద్ధికి అవి ఒరగబెట్టిందేమీ లేదు. అందుకే ఆ రెండు జాతీయ పార్టీలను తిరస్కరించి, మళ్లీ మా పార్టీకే పట్టం కట్టండి..’ అని గులాబీ పార్టీ నేత, మంత్రి హరీశ్ రావు మొన్నటి వరకు ప్రజలను కోరుతూ వచ్చారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకుండా సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తుందంటూ కాషాయదళంపై కారాలు మిర్యాలు నురుతున్నారు. అటు కాంగ్రెస్ ను కూడా ఏమాత్రం వదలడంలేదు. బీజేపీని కాకుండా ప్రధానంగా హస్తం పార్టీపైనే విరుచుకు పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ తెలంగాణకు చేసిన మేలేదీ లేదన్నది హరీశ్ రావు ప్రధాన ఆరోపణ. దాన్నే ఆయన దుబ్బాక ఎన్నికల్లో పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఫార్మాసిటీలో ఉద్యోగాలు, కాళేశ్వరం నీళ్లు, 24 గంటల కరెంట్ వంటి ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ‘24 గంటల కరెంటు, ఎకరానికి 10 వేలు ఇచ్చింది మేమే. మీరు మావైపా, కాంగ్రెస్‌ వైపా?’ అని ప్రజలను నేరుగా అడుగుతున్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఉన్న బలమైన నేపథ్యాన్ని, ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే హరీశ్ సహా ఇతర టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌నే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మరోపక్క.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కోసం తీసుకెళ్తున్న రూ. 40 లక్షల డబ్బు దొరకడంతో ఆ పార్టీ చిక్కుల్లో పడిపోయింది. 2018 ఎన్నికల్లోనూ పోటీ చేసిన రఘనందన్ రావు దాదాపు 14 శాతం ఓట్లతో అంటే 22,595 సాధించి మూడో స్థానంలో నిలిచారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు బలంగా ఉన్నా రెండేళ్లుగా ప్రజలు ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారని, అదే తమకు కలిసి వస్తుందని కమలనాథులు భావిస్తున్నారు.

అయితే, దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వారసురాలిగా బరిలో ఉన్న ఆయన భార్య సుజాతపై ప్రజల్లో సహజంగానే సానుభూతి ఉంటుందని, విపక్షాల ప్రభావం ఉండదని టీఆర్ఎస్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు స్థానిక అంశాల చుట్టూ తిరుగుతాయి కనుక బీజేపీ ప్రస్తావించే అయోధ్య, కశ్మీర్ వంటి జాతీయస్థాయి రాజకీయాలు పనిచేయవని, కాంగ్రెసే తమ ప్రధాన అభ్యర్థి అని విమర్శలకు పదునుపెడుతోంది. టీడీపీ అభ్యర్థి ఇల్లెందుల రమేశ్‌తోపాటు మిగతా అభ్యర్థుల ప్రభావం నామమాత్రంగా కూడా లేకపపోవడం, కమ్యూనిస్టు పార్టీల తెరపై లేకపోవడంతో ఇప్పుడు దుబ్బాక్ వార్ టీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు మధ్యే అని భావించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఒకవైపు కరోనా ప్రభావం, మరోవైపు హైదరాబాద్ వరదలు తెలంగాణ ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. దీన్ని అదనుగా తీసుకొని కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు కేసీఆర్ సర్కారుపై దుమ్మెత్తి పోస్తున్నాయి. సరిగ్గా ఈటైంలోనే దుబ్బాక ఉపఎన్నికలు రావడంతో మొత్తం వాతావరణం అంతా ఒక్క సారిగా వేడెక్కిపోయింది. మరి ఈ తరుణంలో కేసీఆర్ దుబ్బాక దంగల్ లోకి దిగుతారా. ఇప్పటి వరకు ఏ ఉపఎన్నిక అయినా సరే కేసీఆర్ ఎంటర్ అయిన తర్వాత మొత్తం వార్ వన్ సైడ్ గా మారిపోయింది. మరి ఈసారి ఈ సీన్ రిపీట్ అవుతుందా లేక దుబ్బాక సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకూ అన్ని అసెంబ్లీ ఉపఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ వచ్చినట్లుగానే ఈ ఉపఎన్నికను కూడా కైవసం చేసుకుని… జనంలో తమపై ఏమాత్రం వ్యతిరేకత లేదని నిరూపించాలనుకుంటున్నారు. దుబ్బాక ఉపఎన్నికలో గెలిస్తే ఇప్పుడిప్పుడే బలం పోగేసుకుంటున్న కాంగ్రెస్ ను మరోసారి చావుదెబ్బ తీయోచ్చని కేసీఆర్ భావిస్తున్నారు.

టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత గెలుపు కోసం మంత్రి హరీష్‌రావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. తోగుట మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు లక్ష్మణ్‌గౌడ్‌, మరో నలుగురు వార్డు మెంబర్లు, వందమంది యువకులు హరీష్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే దుబ్బాకలో ప్రత్యర్థి ఎవరైనా సోలిపేట సుజాత గెలుపు ఖాయమంటున్నాయి గులాబీ శ్రేణులు.దుబ్బాకలో లక్ష ఓట్ల మెజారిటీయే లక్ష్యమంటున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు.

అటు దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కోసం కాంగ్రెస్‌ అగ్రనేతలంతా రంగంలోకి దిగారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ ఠాగూర్ సమక్షంలో..తోగుట ఎంపీపీ గాంధారి లత, నరేందర్ రెడ్డి టిఅర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ వారికి స్వాగతం పలికారు. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ.హనుమంతరావు.. చెరుకు శ్రీనివాస్‌రెడ్డి తరపున అప్పనపల్లి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. దుబ్బాకలో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారాయన!

అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కీలక నేతలను బ‌రిలోకి దింపడంతో..పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. నియోజక‌వ‌ర్గంలోని మండ‌లాల‌ను, మండ‌లంలోని గ్రామాల‌ను డివైడ్ చేసుకొని నాయ‌కుల‌కు బాధ్యత అప్పగించారు. బూత్‌ల వారీగా ఓట‌ర్లను క‌లుస్తూ… తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. అయితే దుబ్బాక ఉప ఎన్నిక‌లో బీజేపీ త‌రుపున ప్రచారం చేసేందుకు జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తున్నార‌న్న ఊహాగానాలు జోరందుకున్నాయి. తెలంగాణలో బలపడాలనుకుంటున్న బీజేపీ… కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి దూకుడుగా వెళ్తోంది. పలు సమస్యల పరిష్కారం కోసం నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో వచ్చిన దుబ్బాక ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని తహతహలాడుతోంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం దుబ్బాకలో మకాం వేసి అభ్యర్థి గెలుపుకోసం పనిచేస్తున్నారు.