కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తు.. నమ్మిన కమిటీయే ఛీట్ చేసిందా ?

Kidney Scam, కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తు.. నమ్మిన కమిటీయే  ఛీట్ చేసిందా ?

విశాఖలో కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. దీనిపై లోతుగా ఇన్వెస్టిగేట్ చేసిన వీరు..తమ ఫోకస్ ని మెల్లగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ కమిటీపై పెట్టారు.. నమ్మిన వాళ్ళే నట్టేట ముంచుతారన్నట్టు ఈ కమిటీ సభ్యులే అనుమానాస్పదంగా వ్యవహరించిన వైనం ఈ దర్యాప్తులో బయట పడింది. (ఈ కమిటీనే ఆథరైజేషన్ కమిటీ అని కూడా వ్యవహరిస్తున్నారు). కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సల్లో శ్రధ్ధా ఆసుపత్రి ఎండీ ప్రదీప్ కుమార్, మరికొందరు నిబంధనలను ఉల్లంఘించారంటూ వారిపై పోలీసులు రెండు కేసులు పెట్టారు. ఏపీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ యాక్ట్ కింద వీరు రూల్స్ అతిక్రమించారన్నది ప్రధాన అభియోగం. ఈ ఆసుపత్రి దాదాపు 69 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసిందని, వీటిలో 29 ఆపరేషన్లు రూల్స్ కి వ్యతిరేకంగా జరిగాయని సిట్ తో బాటు మరో ముగ్గురు సభ్యుల కమిటీ గుర్తించింది. ఈ 29 కేసుల్లో ముఖ్యంగా రెండు కేసులు చాలా అనుమానాస్పదంగా కనిపించాయి. డోనర్లకు సంబంధించిన డాక్యుమెంట్లను రోగుల తరఫు బంధువులకు చెందినవిగా చూపుతూ ఫోర్జరీ చేశారని వెల్లడైంది. ఈ రెండు కేసుల్లోనూ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ (ఆథరైజేషన్) కమిటీ ఆమోద ముద్ర వేయడం డౌట్ ఫుల్ గా ఉందని సాక్షాత్తూ సీపీ మహేష్ చంద్ర లడ్డా పేర్కొన్నారు. డాక్యుమెంట్లను సరిగా తనిఖీ చేయాల్సిన అవసరం ఈ కమిటీకి లేదా అని ఆయన ప్రశ్నించారు. ఒక డాక్యుమెంటును పరిశిలిస్తే.. బెంగుళూరుకు చెందిన శివకుమార్ అనే రోగి భార్య డాక్యుమెంట్లను ఫోర్జరీ చేసినట్టు కనిపించిందన్నారు.
ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ యాక్ట్ కింద అవయవాలను అమ్మరాదు. రోగి తరఫు బంధువులు డొనేట్ చేస్తేనే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. టి. పార్థసారథి అనే వ్యక్తి తనకు ఈ ఆసుపత్రి యాజమాన్యం రూ. 12 లక్షలు ఇస్తానని చెప్పి రూ. 5 లక్షలే ఇచ్చిందంటూ గత ఏప్రిల్ లో ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *