బైక్‌ల మీద వచ్చి.. చేపల చెరువు లూటీ..

వేసవి ఎండలకు ఉసూరుమన్న ప్రాణం తొలకరి జల్లులతో ఉపశమనం పొందుతుంది. వాతావరణంలో వచ్చిన ఈ తేడాను తట్టుకునేందుకు చేపలు తినాలంటారు. మృగశిర కార్తె వచ్చిందనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చేపలే. అందుకు ఎక్కడ చూసినా మార్కెట్లు రష్‌గా కనిపిస్తాయి. అయితే మహబూబాబాద్ జిల్లా కురవి గ్రామస్థులు చేపల వేటకు వెళ్లారు. స్థానికంగా ఉన్న బతుకమ్మ పెద్ద చెరువులో లూటీ చేశారు.

కురవి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఒక్కసారిగా చెరువుపై పడ్డారు. చేపల కోసం ఏకంగా దండయాత్ర చేశారు. దొరికినవారికి దొరికినంత మహాదేవా అన్నట్లు దొరికినకాడికి చేపలను పట్టుకెళ్లారు. మృగశిర కార్తె నాడు చేపలు తినాలనే ఉద్దేశంతో జనమంతా ఇలా చేపల వేట కొనసాగించారు. మూకుమ్మడిగా తరలివచ్చారు. దొరుకునా ఇటువంటి చాన్స్ అంటూ చెరువులోకి దిగి చేపలను పట్టుకెళ్లారు.

కురవి చెరువులో నీరు అడుగంటింది. దీంతో గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వలలతో చెరువులోకి దిగారు. మగవారితోపాటు మహిళలు కూడా పోటీ పడి వలలు చీరలు చేతబట్టి చేపలను పట్టుకెళ్లారు. పెద్ద ఎత్తున జనం చేపల వేటకు రావడంతో ఎటుచూసినా జనసందోహమే కనిపించింది. చెరువు చుట్టూ బైకులతో నిండిపోయి పార్కింగ్ స్థలాన్ని తలపించింది. కొంతమంది అయితే ఏకంగా బస్తాల కొద్ది చేపలను తరలించేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *