బీహార్ లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముజఫర్‌పూర్ జిల్లా బరురాజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చౌల్హాయీ బిషూన్పూర్ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామ అభివృద్ధిని రాజకీయ నేతలు విస్మరించారని, ఎవరూ గ్రామాన్ని పట్టించుకోకపోవడంతోనే ఈ ఎన్నికల్లో ఓటు వేయవద్దని నిర్ణయించుకున్నట్లు గ్రామస్తులు స్పష్టం చేశారు. మొత్తం గ్రామంలో 729 ఓట్లు ఉండగా.. ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. పోలింగ్ సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు. అధికారులు గ్రామస్తులకు సర్ధి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
బీహార్ లో రెండో విడత పోలింగ్ లో భాగంగా ఇవాళ 17 జిల్లాల పరిధిలోని 94 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 1,463 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2.85 కోట్ల మందికి పైగా ఓటర్లు ఖరారు చేయనున్నారు. ఈ దఫా పోలింగ్‌లో మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీఎం నితీశ్‌కుమార్ క్యాబినెట్‌లోని నలుగురు మంత్రులు, సినీ నటుడు శత్రఘ్నసిన్హా తనయుడు లవ్‌సిన్హా తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు. తేజస్వీ తన కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాఘోపూర్‌లో, ఆయన సోదరుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ సమస్తిపూర్ నుంచి పోటీలో ఉన్నారు.