ఇంకా లీగల్ ప్రాబ్లమ్స్ ! ఇప్పట్లో భారత్ కు విజయ్ మాల్యా అప్పగింత లేనట్టే !

బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా ను బ్రిటన్.. భారత్ కు ఇప్పట్లో అప్పగించే సూచనలు కనబడడం లేదు. ఆయనను అప్పగించాలంటే మరికొన్ని లీగల్ సమస్యలున్నాయని బ్రిటిష్ హైకమిషన్ తెలిపింది..

ఇంకా లీగల్ ప్రాబ్లమ్స్ ! ఇప్పట్లో భారత్ కు విజయ్ మాల్యా అప్పగింత లేనట్టే !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 04, 2020 | 3:59 PM

బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా ను బ్రిటన్.. భారత్ కు ఇప్పట్లో అప్పగించే సూచనలు కనబడడం లేదు. ఆయనను అప్పగించాలంటే మరికొన్ని లీగల్ సమస్యలున్నాయని బ్రిటిష్ హైకమిషన్ తెలిపింది. అయితే ఈ అంశం చాలా కాన్ఫిడెన్షియల్ (రహస్యం) అని పేర్కొంది. తనను భారత్ కు అప్పగించాలన్న పిటిషన్ ను సవాలు చేస్తూ గత నెలలో విజయ్ మాల్యా లండన్ హైకోర్టుకెక్కారు. అయితే ఆ పిటిషన్ ను కోర్టు తిరస్కరించడంతో మళ్ళీ  ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. కానీ అనుమతి లభించలేదు. కానీ ఆయనను  అప్పగించడానికి ముందు మరికొన్ని సమస్యలున్నాయని బ్రిటిష్ హైకమిషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. బ్రిటన్ చట్టాల ప్రకారం.. ఈ సమస్యలు పరిష్కారమయ్యేవరకు అప్పగింత ప్రక్రియ సాధ్యం కాదని, ఇంతకు మించి వివరాలు చెప్పలేమని ఆయన అన్నారు. సాధ్యమైనంత త్వరగా వీటి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు.

బ్రిటన్ చట్టాల మేరకు అక్కడి హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన 28 రోజుల్లోగా ఒక వ్యక్తిని మరో దేశానికి అప్పగించాల్సి ఉంటుంది. కానీ ఆవ్యక్తి ఆశ్రయం కోరిన పక్షంలో.. శరణార్థిగా ఈ దేశంలోనే ఉంటానని అప్పీలు చేస్తే.. ఆ క్లెయిమ్ పరిష్కారమయ్యేవరకు అప్పగింత సాధ్యం కాదు. కాగా… మాల్యా బ్రిటన్ శరణు జొచ్చారా లేదా అన్నది తెలియలేదు. దీనిపై వ్యాఖ్యానించేందుకు మాల్యా తరఫు లాయర్ ఆనంద్ దూబే నిరాకరించారు. ఇండియాలోని బ్యాంకులకు తొమ్మిది వేల కోట్ల రూపాయల మేర కుచ్ఛుటోపీ పెట్టి లండన్ వెళ్ళిపోయిన మాల్యాకు తిరిగి రుణం  చెల్లించాలన్న ఉద్దేశం లేదని సీబీఐ వర్గాలు అంటున్నాయి. కానీ మాల్యా మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. తాను బకాయిలు చెల్లించడానికి రెడీగా ఉన్నానని ఆయన గతంలో ప్రకటించారు.