కొండెక్కిన కూరగాయల ధరలు !

కూరగాయలు ధరలు కొండెక్కాయి. మార్కెట్లో ఏది కొందామని చూసినా పట్టపగలే చుక్కలు కనపడుతున్నాయి. బెండకాయ నుంచి వంకాయ వరకు.. బీరకాయ నుంచి సొరకాయ వరకు ధరలు భగ్గమంటున్నాయి. ఇక సామాన్యులైతే మార్కెట్‌ వైపు చూసేందుకే భయపడుతున్నారు. ఇప్పటికే కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికిపోయిన పేదలను ఈ ధరలు భయపెడుతున్నాయి.

కొండెక్కిన కూరగాయల ధరలు !
Follow us

| Edited By:

Updated on: Aug 26, 2020 | 10:44 AM

కూరగాయలు ధరలు కొండెక్కాయి. మార్కెట్లో ఏది కొందామని చూసినా పట్టపగలే చుక్కలు కనపడుతున్నాయి. బెండకాయ నుంచి వంకాయ వరకు.. బీరకాయ నుంచి సొరకాయ వరకు ధరలు భగ్గమంటున్నాయి. మార్కెట్‌లో కూరగాయల ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఏదీ కొనే పరిస్థితి కన్పించడం లేదు. ఇక సామాన్యులైతే మార్కెట్‌ వైపు చూసేందుకే భయపడుతున్నారు. ఇప్పటికే కరోనా దెబ్బకు ఆర్థికంగా చితికిపోయిన పేదలను ఈ ధరలు భయపెడుతున్నాయి.

హైదరాబాద్‌లోని రైతు బజార్లతో పాటు గుడ్డిమల్కాపూర్‌, బోయిన్‌పల్లి మార్కెట్లలోనూ ధరలు మండిపోతున్నాయి. ఈనెల ఆరంభంలో టమాట ధర కిలో 16 రూపాయలే ఉంది. కానీ ఇప్పుడు రైతు బజార్లలో ఏకంగా 40 రూపాయలు పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో అయితే 60 నుంచి 70 రూపాయల ధర ఉంది. వంకాయ కిలో 35 నుంచి 50 రూపాయలకు చేరింది. రైతు బజార్లలో బెండకాయ కిలో 50 ఉంటే లోకల్‌ మార్కెట్లలో మరో ఐదు రూపాయలు ఎక్కువే ఉంది. గోరుచిక్కుడు, కాకర కిలో 55 రూపాయలు ఉన్నాయి. పచ్చిమిర్చి కిలో 65 నుంచి 70 రూపాయలు పలుకుతోంది. వీటితో పాటు మిగతా కూరగాయలన్నీ కిలో 50 రూపాయలకు పైనే ఉన్నాయి.

ఈ పదిహేను రోజుల్లో ఇంతలా ధరలు పెరగడానికి భారీ వర్షాలే కారణం. ఈ మధ్య కురిసిన కుండపోత వానలకు కూరగాయల తోటలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉత్పత్తితో పాటు దిగుమతులు దారుణంగా పడిపోవడంతో ఒక్కసారిగా ధరలు ఆకాశానంటాయి. దీనికితోడు రైతు బజార్లతోపాటు లోకల్ మార్కెట్లలో కూరగాయల వ్యాపారులు ధరలు మరింత పెంచేశారు.

సాధారణంగా ఆదిలాబాద్‌, మేడ్చల్‌, నిజామాబాద్‌, మహేశ్వరంతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా హైదరాబాద్‌ మార్కెట్‌కు టమాటా వస్తుంది. అయితే గత 15 రోజులుగా టమాటా రావడం లేదు. అంతేకాదు నిత్యం మనం 21 రకాల కూరగాయలు వినియోగిస్తుంటే అందులో 16 రకాలు కూరగాయలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవే ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కూరగాయలు రాకపోవడం కూడా ధరలు పెరగడానికి మరో కారణం.

తెలంగాణ రాష్ట్రంలో నెలకు 3 లక్షల మెట్రిక్‌ టన్నులు కూరగాయలు వినియోగం జరుగుతుంది. కానీ ఇప్పుడు 2 లక్షల టన్నుల కూరగాయాలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. దీనికి తోడు ఈ మధ్య భారీ వర్షాలు కురవడంతో ఉన్న కూరగాయల తోటలు వరదల్లో కొట్టుకుపోయాయి. దీంతో ఒక్కసారిగా హైదరాబాద్ తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి.