Breaking News
  • భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. కరోనాపై పోరులో భారత్‌ చేయాల్సిందంతా చేస్తోంది. సాయం చేయడానికి భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొంటాం-ప్రధాని మోదీ.
  • ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసలు. కరోనాపై యుద్ధంలో భారతీయుల కృషి అభినందనీయం. భారత ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు-ట్రంప్‌ ట్వీట్‌.
  • కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో గుండెపోటుతో వ్యక్తి మృతి. ఇటీవల కరోనాతో చనిపోయిన వ్యక్తికి సోదరుడు కావడంతో.. స్థానికుల్లో పలు అనుమానాలు. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలింపు. శాంపిల్స్‌ పరీక్షించే వరకు మృతదేహం ఇవ్వమంటున్న అధికారులు.
  • తెలంగాణలో డయల్‌ 100కు పెరుగుతున్న కాల్స్‌. లాక్‌డౌన్‌ తర్వాత డయల్‌ 100కు 13,34,330 కాల్స్‌. ఎమర్జెన్సీ కాల్స్‌-82,014. కోవిడ్‌ సస్పెక్ట్ కాల్స్‌- 2,710. లాక్‌డౌన్‌ కాల్స్‌-21,758. ఇన్‌ ఎఫెక్టివ్‌ కాల్స్‌-87,665. విచారణ కోసం చేసిన కాల్స్‌- 84,123. తగ్గిన చోరీలు, గృహ హింస, రోడ్డుప్రమాదాల కాల్స్‌.
  • తెలంగాణలో క్రైమ్‌ రేట్‌ తగ్గింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో క్రైమ్‌రేట్‌ భారీగా పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో క్రైమ్‌రేటు 56 శాతానికి పడిపోవడం ఊరటనిస్తోంది. లాక్‌డౌన్‌తో దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి.

విడుదల తేదీల ఖరారుకు వెరైటీ పార్ములా.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్

new formula in tollywood, విడుదల తేదీల ఖరారుకు వెరైటీ పార్ములా.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్

తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి సెంటిమెంట్ ఈనాటిది కాదు. సంక్రాంతికి సినిమా విడుదల చేయాలన్న సంకల్పాన్ని ఏడాది ముందే ఖరారు చేసుకునే నిర్మాతలు, దర్శకులు, హీరోలు వాటి తేదీలపై కూడా అంతే పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. ఈ సంవత్సరం సంక్రాంతి రేసులో వున్న నాలుగు సినిమాలకు ఈ పోటీ ఏదో రకంగా ఇబ్బందికరమైన పరిస్థితినే క్రియేట్ చేశాయి. 2020 సంక్రాంతికి నాలుగు సినిమాలు రీలీజ్ అవుతున్నాయి. వాటిలో రజనీకాంత్-దర్బార్, మహేశ్‌బాబు-సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్-అల వైకుంఠపురంలో.., కల్యాణ్‌రామ్-ఎంత మంచివాడవురా… ఈ నాలుగు సినిమాల్లో రెండింటి మధ్య గట్టిపోటీ నెలకొంది. మహేశ్, అల్లు అర్జున్ సినిమాలపై సినీ వర్గాలతోపాటు ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఈ క్రమంలో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో.. సినిమాలు అటు హీరోలకే కాకుండా.. వారి అభిమానులకు ప్రతిష్టాత్మకం అయ్యాయి. ఇదంతా బాగానే వున్నా.. కోట్ల రూపాయలు వెచ్చించి సినిమా తీస్తే.. తగిన సంఖ్యలో థియేటర్ల సంఖ్య దొరక్క పోతే కలెక్షన్లు అంతంత మాత్రమే అవుతాయి. పెద్ద సినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్లు అత్యంత ముఖ్యంగా మారిన నేపథ్యంలో ఒక రోజు భారీ సంఖ్యలో థియేటర్లు దొరికి, రెండో రోజుకు పడిపోవడంతో ఆ సినిమా కలెక్షన్లపై పెద్ద ప్రభావమే పడుతుంది. ఈ పరిస్థితి ఇపుడు సంక్రాంతి సినిమాలకు పరీక్షగా మారింది.

జనవరి 9న దర్బార్ సినిమా రానుండగా.. తెలుగు రాష్ట్రాల కలెక్షన్లపై రజనీకాంత్ ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు సమాచారం. ఆయనే స్వయంగా అల్లు అరవింద్, దిల్ రాజు వంటి థియేటర్లు చేతిలో వున్న తెలుగు సినీ దిగ్గజాలకు ఫోన్ చేసి మరీ థియేటర్లను కేటాయించాల్సిందిగా కోరినట్లు చెప్పుకుంటున్నారు. ఆయనంటే పక్క రాష్ట్రం హీరో. మరి తెలుగులో పెద్ద హీరోలైన మహేశ్, అర్జున్‌ల సినిమాల పరిస్థితి ఏంటి? డిసెంబర్ నాలుగో వారం నుంచే ఈ రెండు సినిమాల విడుదల తేదీల్లో మార్పు వచ్చే అవకాశం వుందని, అల వైకుంఠపురం సినిమా రిలీజ్‌ను ముందుగా అనుకున్న జనవరి 12 కంటే ముందుకు తీసుకు వస్తున్నారని ప్రచారం జరిగింది. దాంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన నిర్మాతల్లో భయం పట్టుకుంది. సంక్రాంతి సినిమాల్లో ఒకదానికి నిర్మాత, మిగిలిన వాటికి పంపిణీదారుడు అయిన దిల్ రాజు.. సైతం విడుదల తేదీలపై ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరు వెనక్కి తగ్గాలని ట్విట్టర్ వేదికగా కోరాల్సి వచ్చింది.

ఈలోగా రెండ్రోజుల ఉత్కంఠకు సడన్‌గా జనవరి 4న తెరపడింది. జనవరి 11న సరిలేరు నీకెవ్వరు, 12న అల వైకుంఠపురంలో సినిమాల విడుదలకు మ్యూచువల్ అండర్ స్టాండ్ కుదరిపోయింది. ఎలా కుదిరిందబ్బా అని అందరూ అనుకుంటుండగా.. ఓ కొత్త పార్ములాను రెండు సినిమాల నిర్మాతలు ఫాలో అయి విషయాన్ని తేల్చుకున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఆ ఫార్ములా వివరాలు తెలుసుకున్న ప్రతీ ఒక్కరు షాక్ గురయ్యారని సినీ పరిశ్రమ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

దీని ప్రకారం ఏ సినిమా ముందు విడుదల కావాలి.. ఏది ఆ తర్వాత తేదీన విడుదల కావాలన్న దానిపై ఇద్దరు నిర్మాతల సమక్షంలో టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు.. కాయిన్ టాస్ వేసినట్లు తెలుస్తోంది. ఈ టాస్‌లో మహేశ్ సినిమా విజయం సాధించడంతో ముందుగా జనవరి 11న సరిలేరు నీకెవ్వరు విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆ తర్వాత జనవరి 12న అల వైకుంఠపురంలో సినిమా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ ఒప్పందంలో భాగంగా.. 11న వంద శాతం థియేటర్లలో సరిలేరు నీకెవ్వరు సినిమా ఆడుతుంది. 12న అల వైకుంఠపురంలో.. మూవీ వంద శాతం థియేటర్లలో ఆడుతుంది. జనవరి 13 తర్వాత రెండు సినిమాలకు సమాన సంఖ్యలో థియేటర్లను కేటాయిస్తారు.

ఈ రెండు సినిమాల మధ్య కుదిరిన ఒప్పందం మిగిలిన రెండు సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇపుడు చర్చగా మారింది. 9న విడుదలయ్యే దర్బార్ మూవీకి 11వ తేదీ తర్వాత థియేటర్లు దొరకడం కష్టమేనని టాలీవుడ్ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అదే సమయంలో 15వ తేదీన విడుదల కానున్న ఎంత మంచి వాడవురా.. సినిమాకు థియేటర్ల కేటాయింపు కూడా కాస్త కష్టమేనని చెప్పుకుంటున్నారు. ఈ టాస్ ఫార్ములా టాలీవుడ్‌లో ఇకపై కూడా కొనసాగుతుందన్న సరదా కామెంట్లు ఇప్పుడు సినీ పరిశ్రమ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Related Tags