ట్రంప్‌ చెబుతున్నట్టు అక్టోబర్‌ చివరికల్లా వ్యాక్సిన్‌ వస్తుందా?

కోవిడ్‌ వ్యాక్సిన్‌ నవంబర్‌నాటి కల్లా ప్రజలకు అందుబాటులో ఉంటుందని చైనా చెబుతుంటే అంతకు ముందే కరోనాకు వ్యాక్సిన్‌ ఇస్తానంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.

ట్రంప్‌ చెబుతున్నట్టు అక్టోబర్‌ చివరికల్లా వ్యాక్సిన్‌ వస్తుందా?
Follow us

|

Updated on: Sep 16, 2020 | 11:22 AM

కోవిడ్‌ వ్యాక్సిన్‌ నవంబర్‌నాటి కల్లా ప్రజలకు అందుబాటులో ఉంటుందని చైనా చెబుతుంటే అంతకు ముందే కరోనాకు వ్యాక్సిన్‌ ఇస్తానంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. అక్టోబర్‌లోనే కరోనా విరుగుడు టీకా రావడం పక్కా అంటున్నారు.. నవంబర్‌ మూడున అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అంతకు ముందే వ్యాక్సిన్‌ను అందుబాటులో తెచ్చి తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలన్నది ట్రంప్‌ భావన. కరోనా మహమ్మారి అమెరికాను తీవ్రంగా దెబ్బతీసిందన్నది వాస్తవం.. కరోనా వైరస్‌ను మొదట్లో చాలా తేలిగ్గా తీసుకున్నారు ట్రంప్‌.. మాస్క్‌లు కూడా పెట్టుకోనంత మొండితనం చూపించారు..ఆ ఉదాసీనత కారణంగానే కోవిడ్‌-19 వైరస్‌ అమెరికా అంతటా వ్యాపించింది.. ప్రజల ప్రాణాలు తీస్తోంది.. కరోనా నియంత్రణలో ట్రంప్‌ విఫలం చెందినట్టేనని ప్రజలు భావిస్తున్నారా? లేక ట్రంప్‌ మాత్రం ఏం చేస్తారులే అన్న అభిప్రాయంతో ఉన్నారా? టీకా వస్తే ప్రజలు మళ్లీ ట్రంప్‌కే పట్టం కడతారా? ఇలాంటి ఇప్పటికిప్పుడు జవాబులు చెప్పడం ఒకింత కష్టమే!

నిజానికి అమెరికా ఎన్నికలపై కరోనా ప్రభావం గట్టిగానే ఉండబోతున్నది. అమెరికా ప్రజలు ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు.. అలాంటిది కరోనా ఆరోగ్యంతో ఆటలాడుకుంటుండటం చాలామందికి నచ్చడం లేదు. ఉగ్రవాదాన్ని తీవ్రంగా అసహ్యించుకునే అమెరికన్లు కరోనాను అంతకంటే ఎక్కువగా ఈసడించుకుంటున్నారు. కరోనా వ్యాప్తిని అదుపు చేయడంలో ట్రంప్‌ ప్రభుత్వం విఫలమైందన్నదే జనం భావన.. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు.. ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది.. యూరప్‌ దేశాలలో కరోనా వైరస్‌ను కట్టడి చేసినట్టుగా అమెరికాలో ట్రంప్‌ వైరస్‌ వ్యాప్తిని అదుపు చేయలేకపోయారన్న విమర్శలున్నాయి. ఎన్నికలకు రెండు రోజుల ముందే వ్యాక్సిన్‌ తీసుకొస్తానని చెబుతున్న ట్రంప్‌ ఆ మాటకకు కట్టుబడి ఉంటారా అన్నదే ప్రశ్న.. పైగా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు ఆల్‌రెడీ చెప్పేశారు.. ఈ మాటతో ప్రజల విశ్వాసం చూరగొనవచ్చన్నది ట్రంప్‌ ఆశ.. పైగా వ్యాక్సిన్‌ రాబోతున్నదంటే జనం కూడా కాసింత ఊరట చెందుతారని ట్రంప్‌ అనుకుంటున్నారు. ఒకవేళ ట్రంప్‌ చెప్పినట్టుగానే అక్టోబర్‌ చివరికల్లా కరోనా విరుగుడు వ్యాక్సిన్‌ వచ్చిందే అనుకుందా! దాన్ని ఎలా విశ్వసించడం? ఇంత హడావుడిగా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వడం మంచిదేనా? వికటించే ప్రమాదం లేదా? అంటే కచ్చితంగా ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు. ట్రంప్‌ చెప్పే అక్టోబర్‌ సర్‌ప్రైజ్‌ కాస్తా… అక్టోబర్‌ ట్రాజెడీగా మారే ప్రమాదముందంటున్నారు. పరిశోధనలు పూర్తి కాకుండా ఇవ్వడం వల్ల లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. కరోనా భీకరంగా ఉన్న ఇలాంటి తరుణంలో ఎన్నికలు ఎలా జరుపుతారని కొందరు ప్రశ్నిస్తున్నారు.. నిజంగానే ఎన్నికలను నిర్వహించడం కత్తిమీద సామే! కరోనా కారణంగా అబ్సెంటీ బ్యాలెట్‌లు చేరుకోవడం చాలా ఆలస్యం కావచ్చు. ఎన్నికల ఫలితాలు రావడానికి కూడా ఆలస్యం కావచ్చు.