బాబోయ్ అమెరికా ! ఇక వీసా ‘ వీజీ ‘ కాదు గురూ !

US Vissa, బాబోయ్  అమెరికా ! ఇక వీసా ‘ వీజీ ‘ కాదు గురూ !

వీసా మంజూరులో అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినతరం చేయబోతోంది. ఇది ముఖ్యంగా భారతీయులకు శాపంగా మారబోతోంది. ఉద్యోగం కోసమో, స్టడీకోసమో ఆ దేశానికి వెళ్ళగోరే అభ్యర్థులకు ట్రంప్ సర్కార్ చుక్కలు చూపడానికే నిర్ణయించుకున్నట్టు కనబడుతోంది. వీరు తమ ఇతర వివరాలతో బాటు తమ అయిదేళ్ల సోషల్ మీడియా డీటైల్స్ ను కూడాఫోన్ నెంబర్లతో సహా అన్నింటినీ తమ దరఖాస్తుల్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇందుకు అమెరికా విదేశాంగ శాఖలోని ఇమ్మిగ్రేషన్ విభాగం అన్ని కసరత్తులూ చేసింది. ఈ అభ్యర్థులు ఐదేళ్ల కాలంలో తాము పంపిన, లేదా అందుకున్న ఈ-మెయిల్స్ వివరాలను సైతం తూ చా సమర్పించాల్సిందేనని, లేని పక్షంలో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఇమ్మిగ్రేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు.ఇంతకుముందు నిబంధనల ప్రకారం వీసా అభ్యర్థులకు ఉగ్రవాదులతో, లేదా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో మాత్రమే విచారణ చేపట్టేవారు. కానీ ఇప్పుడు నిజమైన అభ్యర్థులను గుర్తించేందుకు సోషల్ మీడియా ఖాతాల ఆధారంగానూ విచారణ చేపడతారు. ఇప్పటికే అమెరికాలో గ్రీన్ కార్డు కోసమో, ఇతర సౌకర్యాలకోసమో అక్కడి భారతీయులు రకరకాల నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితి ఉంది, జాబ్ చేస్తున్న భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి మాత్రమే ఈ అర్హత ఉన్న సంగతి తెలిసిందే. వీసా మంజూరుకు ఇదివరకే ఎన్నో ‘ కష్టాలు, ఇబ్బందులు ‘ పెడుతున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరెన్ని క్లిష్టతరమైన మార్పులు తెస్తుందోనని ముఖ్యంగా భారతీయ యువత ఆందోళన చెందుతోంది. టారిఫ్ ల విషయంలో భారత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పట్ల గుర్రుగా ఉన్న అమెరికా.. ఇలా ‘ కక్ష ‘ తీర్చు కుంటోందేమోనని వీరు తీవ్రంగా కలత చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *