బ్యాంకింగ్ సంస్కరణలతో .. బడ్జెట్ లో ఎకానమీకి ఊపు ?

NIRMALA SITARAMAN, బ్యాంకింగ్ సంస్కరణలతో .. బడ్జెట్ లో ఎకానమీకి ఊపు ?

ప్రధాని మోదీ 2.0 ప్రభుత్వ తొలి బడ్జెట్ ని కొత్త ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎలా సమర్పిస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 2019-20 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ను ఆమె జులై 5 న పార్లమెంటులో సమర్పించనున్నారు. దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ వైపు దూసుకుపోయే విధంగా బ్యాంకింగ్ రంగ సంస్కరణలకు ఈ బడ్జెట్లో పెద్ద పీట వేయవచ్చు. అంటే దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత పుంజుకునేలా బ్యాంకులు కీలక పాత్ర వహించే సూచనలున్నాయని అంటున్నారు. 2018-19 లో భారత ఆర్ధిక వృద్ది రేటు 6.8 శాతం మాత్రమే ఉన్న నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ప్రతిపాదించనున్న బడ్జెట్ పై అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా సంస్కరణలకు ప్రాధాన్యమిస్తూ ఒక రోడ్ మ్యాప్ మాదిరి ఇది వుండవచ్చునంటున్నారు. గత ఏడాది మొదలు పెట్టిన బ్యాంకుల విలీన ప్రక్రియకు మరింత ఊతమిచ్ఛేలా కొత్త విత్త మంత్రి ప్రయత్నించవచ్ఛునని తెలుస్తోంది. ఈ ఎక్సర్ సైజులో భాగంగా.. విజయా బ్యాంకు, దేనా బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో (ఏప్రిల్ 1 నుంచి) విలీనమైన సంగతి తెలిసిందే. ఇలాగే చిన్న బ్యాంకులు పెద్ద జాతీయ బ్యాంకుల్లో విలీనమయ్యేలా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాపిటల్ బేస్ (మూలధన పెట్టుబడి) ని పెంచేందుకు ప్రభుత్వం రూ. 5,042 కోట్లను ఇందులో మదుపు చేసింది. పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్ పరిశ్రమను ఒకే గాటన కట్టాలని 1991 లోనే అప్పటి నరసింహం కమిటీ తన నివేదికలో సిఫారసు చేసింది. కన్సాలిడేటెడ్ ఎంటిటీ ఆపరేషన్ (మూలధన వ్యవస్థ) 15 లక్షల కోట్ల మేర ఉండాలని అప్పుడే బ్యాలన్స్ షీట్ రూపొందించారు. ఇందులో డిపాజిట్లు 8.75 లక్షల కోట్లు, అడ్వాన్సులు రూ. 6.25 లక్షల కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. అటు-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ సహా మరో నాలుగు బ్యాంకులు విలీనమైన
సంగతి గమనార్హం. ఇక గ్రామీణాభివృద్ది, రైతుల సంక్షేమ పథకాలు వంటి వరాలు ఈ బడ్జెట్లో ఉంటాయని భావిస్తున్నారు. నల్లధన కట్టడికిమోదీ ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఇటు దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెడుతూనే.. అటు మధ్యతరగతి, నిమ్న వర్గాల సంక్షేమానికి నిర్మలా సీతారామన్ తాయిలాలు ప్రకటించవచ్చునని కూడా తెలుస్తోంది. అలాగే బడా వాణిజ్య వర్గాల పట్ల మోడీ సర్కార్ కొంత ‘ పదునైన ‘ చర్యలకు ఉపక్రమించవచ్చు. రెండో సారి ప్రధానిగా తనను ఎన్నుకున్నందుకు మోదీ ఈ బడ్జెట్ లో ఎవరిని. ఎలా కరుణిస్తారో, ఎవరిని ఎలా ‘ డీల్ ‘ చేస్తారో వేచి చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *