ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ గుడ్ న్యూస్… వచ్చే వారం టీకా విడుదల..?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై లండన్ కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ఓ శుభవార్త చెప్పింది.

  • Balaraju Goud
  • Publish Date - 5:33 pm, Mon, 26 October 20

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై లండన్ కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ఓ శుభవార్త చెప్పింది. త్వరలోనే టీకాను అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. యూకేకు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 మొదటి బ్యాచ్ వ్యాక్సిన్‌ను లండన్‌లోని ఓ ఆసుపత్రి సిబ్బంది తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. నవంబర్ మొదటి వారం కల్లా వ్యాక్సిన్‌ను సిద్దంగా చేస్తున్నట్లు తెలిపింది. ఫస్ట్ బ్యాచ్ వ్యాక్సిన్ కోసం ఆస్పత్రిని రెఢీ చేయాలంటూ ఈ ఆసుపత్రికి ఆదేశాలు వచ్చినట్టు యూకేకు చెందిన ఓ ప్రముఖ పత్రిక సోమవారం వెల్లడించింది.

కరోనా మహమ్మారి నుంచి ఎప్పుడెప్పుడు విముక్తి కలుగుతుందని ప్రపంచం మొత్తం ఆశగా ఎదురుచూస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4.3 కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 11 లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక, అనేక దేశాల్లో కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందిస్తున్న వ్యాక్సిన్ మొదటగా బయటకు వచ్చే అవకాశమున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెగ్యులేటరీ అప్రూవల్ కూడా ముందుగా ఈ వ్యాక్సిన్ పొందే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే తుది దశ ట్రయల్స్ పూర్తి చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే, ఫ్రంట్ లైన్ వారియర్స్ కే ముందస్తు టీకా వేసే అవకాశమున్నట్లు తెలుస్తుంది.