గ్రేటర్ పీఠంపై కన్నేసిన మహిళామణులు.. అప్పుడే మొదలైన లాబీయింగ్.. కుటుంబీకుల ఒత్తిడితో లీడర్ల సతమతం

మహిళ మహారాణి కాబోతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగరానికి తొలి పౌరురాలు కానుంది. ఈసారి మేయర్ సాధారణ మహిళా రిజర్వేషన్‌ కావడంతో మహిళామణులు తెరపైకి వచ్చారు.

  • Balaraju Goud
  • Publish Date - 7:22 pm, Thu, 19 November 20

మహిళ మహారాణి కాబోతోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మహానగరానికి తొలి పౌరురాలు కానుంది. ఈసారి మేయర్ సాధారణ మహిళా రిజర్వేషన్‌ కావడంతో మహిళామణులు తెరపైకి వచ్చారు. విశ్వనగరంగా పేరొందుతున్న హైదరాబాద్‌ మేయర్‌ పీఠంపై బడా నేతల కుటుంబాలు అశలు పెట్టుకున్నాయి. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన మంత్రులు, కీలక నేతలు తమ కోడళ్లను, ఒకరేమో భార్యను రంగంలోకి దింపారు. మేయర్ అభ్యర్థి కోసం తీవ్ర స్థాయిలో లాబీయింగ్‌ చేస్తున్నారు. అయితే, ఈసారి మేయర్ పీఠం అధికార పార్టీకే దక్కనుంటంతో ముఖ్యనేతలు నేనంటే నేనని ముందుకొస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన టికెట్లు, ఇవ్వాల్సిన టికెట్లు- క్రమంగా క్లారిటీని ఇస్తున్నాయి.

పాలిచ్చే తల్లికి పాలించడం పెద్ద లెక్కా..! ఇప్పుడు హైదరాబాద్‌ మహానగరాన్ని పాలించే అవకాశం మహిళకు దక్కింది. హైదరాబాద్‌ మేయర్‌ అంటే- కోటిమందికిపైగా ఉన్న జనాభా మహానగరానికి తొలి పౌరురాలు అన్నమాట. తెలంగాణకు ఆర్థిక యంత్రంలాంటి రాజధాని నగరాన్ని పాలించే బల్దియాకు చైర్‌పర్సన్‌. కల్పవృక్షం లాంటి జీహెచ్ఎంసీ ఏలడమంటే మామూలు విషయం కాదు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన పదవి కోసం అధికారపార్టీలో పోటీ తీవ్రంగా ఉంది.

అయితే, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, మంత్రి మల్లారెడ్డి కోడళ్లు పోటీలో ఉంటారని ఊహాగానాలు వచ్చినా, వారికి టికెట్లు దక్కలేదు. దీంతో, మేయర్‌ పదవి ఎవరికి అన్న అంశంపై ఎవరికి తోచినట్లు వారు ప్రచారం చేసుకుంటున్నారు. మేయర్‌గా పేరు ఖరారు కావాలంటే ముందుంగా పార్టీలు వారికి టికెట్లు ఇవ్వాలి. టికెట్‌ లభించడం అనేది తొలి అడుగుగా చెప్పుకోవచ్చు.

మేయర్‌ స్థానం మహిళకు రిజర్వ్‌ కావడంతో పార్టీలు ఒకరిపైనే ఆధారపడకుండా కొంతమందిని ఎంచుకుంటాయి. వారికి టికెట్లు ఇస్తాయి. ఇలా ఇకెట్లు వచ్చిన వారిలో టీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరు మహిళలు ప్రముఖంగా కనిపిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎల్పీ నేతగా పనిచేసి, మంత్రిగా పనిచేసిన దివంగత పీజేఆర్‌ కూతురు విజయారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమెకు ఇప్పటికే ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌గా ఉన్నారు. విజయారెడ్డికి మళ్లీ ఖైరతాబాద్‌ డివిజన్‌ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది. బల్దియా ఎన్నికల్లో ఆమె గెలిచి, గులాబీ పార్టీ విజయం సాధిస్తే, ఆమెకు మేయర్‌ చాన్స్‌ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక, మేయర్‌ రేసులో కనిపిస్తున్న మరో మహిళా నాయకురాలు గద్వాల విజయలక్ష్మి. టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు కూతురు. గద్వాల విజయలక్ష్మి ఇప్పటికే బంజారాహిల్స్‌ డివిజన్‌కు కార్పొరేటర్‌గా ఉన్నారు. గులాబీపార్టీ ఆమెకు మళ్లీ బంజారాహిల్స్‌ టికెట్టే ఇచ్చింది. వాస్తవానికి ఆమె పేరు 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనే వినిపించింది. కానీ మేయర్‌ పదవి బొంతు రామ్మోహన్‌ను వరించింది. ఇప్పుడు మాత్రం మేయర్‌ సీటుని మహిళకు రిజర్వ్‌ చేయడంతో గద్వాల విజయలక్ష్మిపై ఫోకస్‌ పెరిగింది

మహానగర మేయర్‌ పదవికి పోటీ ఇద్దరితోనే ఆగిపోలేదు. చర్లపల్లి డివిజన్‌ సస్పెన్స్‌ను పెంచేస్తోంది. చర్లపల్లి నుంచి ప్రస్తుత మేయర్‌ బొంతు రామ్మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 105 మందితో ప్రకటించిన తొలి జాబితాలో చర్లపల్లి డివిజన్‌ను పెండింగ్‌లో పెట్టారు. సిట్టింగ్‌లకే సీట్లు ఇచ్చిన టీఆర్‌ఎస్‌ చర్లపల్లి అభ్యర్థిగా బొంతు రామ్మోహన్‌ను ప్రకటించలేదంటేనే రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఎలాగూ మేయర్‌ పీఠం మహిళకు ఖరారైంది కాబట్టి.. బొంతు రామ్మోహన్‌ తన భార్య శ్రీదేవి కోసం లాబీయింగ్‌ చేస్తున్నారంటూ ఊహాగానాలు వచ్చాయి. బొంతు రామ్మోహన్‌ తన భార్య శ్రీదేవితో వెళ్లి మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కవితను కలిసినట్లు సమాచారం. చర్లపల్లి టికెట్‌ను బొంతు రామ్మోహన్‌ భార్య శ్రీదేవికి ఇస్తే మేయర్‌ పదవికి ఆమె రేసులో ఉన్నట్లేనని గులాబీ కండువాలు చెప్పుకుంటున్నాయి.

మరోవైపు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు కుటుంబాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తన కోడలు మహితను రంగంలోకి దింపారు. మేయర్ రేసులో నిలబెట్టేందుకు కార్పొరేటర్ టికెట్‌ను ఆశిస్తున్నారు. మరో వైపు డిప్యూటీ స్పీకర్ పద్మారావు కోడలు శిల్పా రామేశ్వరిని మేయర్ రేసులో నిలబెట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి కూడా తన కోడలు ప్రీతిరెడ్డికి టికెట్ ఇప్పించేందుకు లాబీయింగ్ పెద్ద ఎత్తున చేస్తున్నట్లు తెలుస్తోంది.

పార్టీలోని ముఖ్య నేతలు కూతుళ్లు, కోడళ్లకు టికెట్లు ఇప్పించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గ్రేటర్‌ ఎన్నికలను భుజానకెత్తుకున్న మంత్రి కేటీఆర్‌కు సహకరించేందుకు ఎమ్మెల్సీ కవిత రంగంలోకి దిగారు. మేయర్ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్న ముఖ్య నేతలంతా ప్రస్తుతం కవితను కలిసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మేయర్ మహిళకు ఖరారు కావడంతో ఇప్పటి వరకు రాజకీయ అరంగేట్రం చేయని యువ మహిళామణులు గ్రేటర్‌ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గ్రేటర్‌ ఫైట్‌ చేస్తున్న మిగతాపార్టీల సంగతెలా ఉన్నా, టీఆర్‌ఎస్‌లో మాత్రం జోష్‌ కనిపిస్తోంది. తమ పార్టీ తరపున మేయర్‌ అభ్యర్థిని టీఆర్‌ఎస్‌ ప్రకటించపోయినా, కొందరు మహిళల నేపథ్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.