Delhi CAA Clashes: ‘ఆర్మీని పిలవాల్సిందే ‘! ఢిల్లీ అల్లర్లపై సీఎం అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు, హింసాకాండను పోలీసులు అదుపు చేయలేకపోతున్నారని, పరిస్థితిని అదుపులోకి తేవాలంటే సైన్యాన్ని రప్పించవలసిందేనని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

Delhi CAA Clashes: 'ఆర్మీని పిలవాల్సిందే '! ఢిల్లీ అల్లర్లపై సీఎం అరవింద్ కేజ్రీవాల్
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Feb 26, 2020 | 1:10 PM

Delhi CAA Clashes: ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు, హింసాకాండను పోలీసులు అదుపు చేయలేకపోతున్నారని, పరిస్థితిని అదుపులోకి తేవాలంటే సైన్యాన్ని రప్పించవలసిందేనని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్రాన్ని అభ్యర్థించారు. ఇప్పటివరకు నగర పోలీసులు ఈ హింసాకాండను కంట్రోల్ చేయగలరని ఆశించామని, కానీ రెచ్చిపోతున్న  ఆందోళనకారులను అదుపు చేయడానికి వారికి సాధ్యం కావడంలేదని ఆయన పేర్కొన్నారు.  ఈ నెల 23 నుంచి ప్రారంభమైన హింసతో నగరం అట్టుడుకుతోంది. ఘర్షణలు, అల్లర్లలో మరణించిన వారి  సంఖ్య 20 కి పెరిగింది. 150 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో అనేకమంది పోలీసులు కూడా ఉన్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మంగళవారం రాత్రి సీలంపూర్. జఫ్రాబాద్, మౌజ్ పురి. గోకుల్ పురి చౌక్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. సీఏఏ అనుకూల, వ్యతిరేకవర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకుంటూ.. తమను కంట్రోల్ చేయబోయిన పోలీసులపై కూడా రాళ్లవర్షం కురిపిస్తున్నారు. ఈ నెల 24 న వీరి దాడిలో ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ మరణించిన సంగతి తెలిసిందే.

ఆందోళనకారులు వాహనాలకు, షాపులు, పెట్రోల్ బంకులకు సైతం నిప్పు పెడుతున్నారు. పరిస్థితి అదుపు తప్పుతున్న నేపథ్యంలో.. భద్రతా వ్యవహారాలపై గల కేబినెట్ కమిటీ అత్యవసరంగా సమావేశమవుతోంది. ఇలా ఉండగా.. జెఎన్ యు, జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీల విద్యార్థులు గత రాత్రి పొద్దుపోయిన తరువాత సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిముందు పెద్ద సంఖ్యలో గుమికూడారు. ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించాలని వారు డిమాండ్ చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ఈ తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో వాటర్ క్యానన్లను ప్రయోగించారు. నగరంలో కర్ఫ్యూ వంటి వాతావరణంఏర్పడింది.

‘పోలీసులను నమ్మండి’.. అజిత్ దోవల్

ఢిల్లీ నగరంలో తగినన్ని పోలీసు బలగాలు ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందవలసిన పని లేదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. చట్టానికి కట్టుబడిన ఏ వ్యక్తికీ ఎవరూ హాని చేయకుండా చూస్తామన్నారు. నగర పోలీసుల సామర్థ్యంపై అనేకమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, దీన్నపరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. ఖాకీ యునిఫారాలను ధరించినవారిని నమ్మండి అని  పేర్కొన్నారు. హింసకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన దోవల్.. ఏ సాధారణ పౌరుడూ చేతిలో గన్ పట్టుకుని తిరగకుండా చూస్తామని చెప్పారు. ప్రజల్లో అభద్రతా భావం ఏర్పడింది . అది తొలగిపోయేలా చూస్తాం అన్నారాయన.