జంబో బోర్డుపై ఎవరికీ వారే.. యమునా తీరే !!

Tirmula Tirupathi Devasthanam, జంబో బోర్డుపై ఎవరికీ వారే.. యమునా తీరే !!

కనివిని ఎరుగని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇందులో ఆధ్యాత్మిక భావనాలున్న వారికీ పెద్ద పీట వేయడంతో సభ్యుల ఎంపికపై ఎవరు పెద్దగా కామెంట్ చేసేందుకు అవకాశం కూడా దక్కలేదు. ఆధ్యాత్మిక భవనాలు, హిందూ ధర్మ పరి రక్షణ, ప్రచారానికి ప్రాధాన్యత నిచ్చే వారికీ టీటీడీ ట్రస్ట్ బోర్డులో సభ్యత్వం కల్పించడాన్ని చాలా మంది ప్రశంసించారు కూడా. కానీ ఒక్క విషయం మాత్రం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఇబ్బంది కరంగా పరిణమించే సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో టీటీడీకి 20కి మించకుండా ట్రస్ట్ బోర్డు సభ్యులతో కమిటీ ఏర్పాటయ్యేది. కానీ, ఈసారి ఏకంగా ఆరు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ, సభ్యులు, ఎక్స్-అఫిషియో సభ్యులు, గౌరవ సలహా మండలి సభ్యులు అంటూ 36 మందికి అవకాశం కల్పిస్తూ జంబో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ విషయం కమలం నేతలకు కంటగింపుగా మారినట్టు కనిపిస్తోంది. కమలం నేతలకు అవకాశం ఇవ్వకపోవడంతో లేక మరేదైనా ఇతర కారణమో కానీ.. జంబో ట్రస్ట్ బోర్డు ఎందుకు అంటూ విమర్శలతో విరుచుకుపడుతోంది. బీజేపీ సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి ఇప్పటికే నాలుగు జీవోలతో 36 మందికి ఛాన్స్ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మరో రెండు జీవోలతో అర్ద సెంచరీ తో టీటీడీ ట్రస్ట్ బోర్డు రికార్డును బద్దలు కొడతారని ఎద్దేవా చేస్తున్నారు. మరో వైపు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి విషయంలో సీఎం వైఎస్ జగన్ వ్యవహరిచిన తీరుపై కాంగ్రెస్ నేతలు కూడా మంది పడుతున్నారు. 36 మంది సభ్యులను నియమించడంపై కోర్టుకెళ్లేందుకు సిద్ధమని కాంగ్రెస్ నేత, రాయలసీమ హక్కుల పోరాట సమితి నేత నవీన్ ప్రకటించారు. 36 మంది పాలక మండలి సభ్యులు… కుటుంబసభ్యులతో సహా వస్తే… ప్రమాణ స్వీకార మండపం అయిన వాహన మండపం సరిపోదని… టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. టీటీడీ గురించి … జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలని సూచించారు. 36 మంది సభ్యులను నియమించడం ఎంత వరకు సమంజసమని .. టీటీడీ చట్టాన్ని తుంగలో తొక్కి ఇష్టానుసారంగా బోర్డును నియమించారని మండిపడ్డారు. తిరుమల శ్రీవారి ఆలయం ఏమైనా జగన్‌ సొంత ఆలయమా?.. ప్రజల ఆలయమా? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పాలక మండలి ఉందన్నారు. తాము రాజకీయంగా ఆరోపణలు చేయడం లేదన్నారు. పాలక మండలికి సంబంధించిన నాలుగు జీవోలను రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మొత్తానికి బీజేపీ, కాంగ్రెస్ నేతల అభ్యంతరాలతో టీటీడీ ట్రస్ట్ బోర్డు వ్యవహారం రసకందాయం పడినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *