Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

కేంద్రంతో తాడోపేడో..కెసీఆర్ యాక్షన్ ప్లాన్

kcr to fight modi govt, కేంద్రంతో తాడోపేడో..కెసీఆర్ యాక్షన్ ప్లాన్

నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోరుకి సిద్ధమవుతున్నారా? తెలంగాణ సమస్యలను పెడచెవిన పెడుతున్న మోదీ సర్కారుతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారా? గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతాలు? ఈ చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తోంది.

తెలంగాణ ఏర్పడిన వెంటనే ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ మోదీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. దీనిపై కేసీఆర్‌ మండిపడ్డారు. కేంద్రం తీరును తీవ్రంగా నిరసించారు. మోదీ ప్రభుత్వ చర్యకు నిరసనగా అప్పట్లో బంద్‌కి పిలుపునిచ్చారు.

ఆ తర్వాత బీజేపీకీ, టిఆర్‌ఎస్‌కీ మధ్య క్రమంగా సఖ్యత పెరుగుతూ వచ్చింది. నోట్ల రద్దు , జీఎస్‌టీ లాంటి కీలకనిర్ణయాల విషయంలో, కేసీఆర్‌ మోదీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఇక రాష్టపతి ఎన్నికల్లోనూ, అనేక బిల్లుల ఆమోదంలోను టీఆర్‌ఎస్‌ బీజేపీ వైపునే నిలబడింది.

ఆ తర్వాతే పరిస్థితిలో మార్పు వచ్చింది. తెలంగాణ బిజెపి నాయకత్వం కెసీఆర్ ప్రభుత్వంపై యుద్దం ప్రకటించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను ఓడించేందుకు బిజెపి ప్రయత్నించింది. దాంతో రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ చరిష్మా టిఆర్ఎస్ పార్టీ జైత్రయాత్రను కొంత మేరకు నిలువరించింది.

అయితే, కేంద్రంలో రెండోసారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తెలంగాణపై పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని కెసీఆర్ భావిస్తున్నారు. జిఎస్టీ పన్నుల్లో వాటా ఇవ్వడంలోను, వివిధ శాఖ కింద రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధుల విషయంలోను మోదీ ప్రభుత్వం తెలంగాణ విఙ్ఞప్తులను పెడచెవిన పెడుతుందని కెసీఆర్ అనుకుంటున్నారు.

అందుకే కేంద్రంపై యుద్దానికి సిద్దమవుతున్నారని గులాబీదళంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఓ వివాహానికి హాజరయ్యేందుకు డిసెంబర్ మొదటివారంలో ఢిల్లీ వెళ్ళిన కెసీఆర్.. ప్రధాన మంత్రిని కలిసేందుకు ప్రయత్నించగా.. టైమ్ దొరకలేదన్న కథనాలు కూడా వున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా జాబితాతో.. గత అయిదేళ్ళుగా కేంద్రం నిర్లక్ష్యానికి నిదర్శనాల వివరాలతో కలిసి.. టిఆర్ఎస్ ఎంపీల బృందంతోపాటు కెసీఆర్ ప్రధానిని కలిసేందుకు త్వరలోనే ఢిల్లీ వెళ్ళేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పార్లమెంటు వింటర్ సెషన్ ముగిసేలోగా సీఎం ఢిల్లీ వెళతారని అందుకు రంగం సిద్దమవుతోందని గులాబీ శ్రేణులు చెబుతున్నారు.