ఒకే వేదికపై మోదీ.. ట్రంప్.. అదే మెగా ఈవెంట్ !

trump to join at howdy modi texas event to emphsize strong ties, ఒకే వేదికపై మోదీ.. ట్రంప్.. అదే మెగా ఈవెంట్ !

టెక్సాస్ లో ఈ నెల 22 న జరగనున్న ‘ హౌడీ మోడీ ‘ మెగా ఈవెంట్ లో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ఒకే వేదికపై కూచుని ‘ కనువిందు ‘ చేయనున్నారు. మోదీతో కలిసి ట్రంప్ కూడా ఆ రోజున వేదికను అలంకరిస్తారని వైట్ హౌస్ ఆదివారం ప్రకటించింది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత పటిష్టం కావడానికి ఈ మెగా ఈవెంట్ దోహదపడుతుందని భావిస్తున్నారు. హూస్టన్ లోని ఎన్ ఆర్ జీ స్టేడియం లో 22 న జరిగే ఈ కార్యక్రమానికి 50 వేల మందికి పైగా ఇండియన్ అమెరికన్లు హాజరు కానున్నారు. అమెరికా గడ్డపై ఓ విదేశీ నేత పాల్గొననున్న కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇండియన్ అమెరికన్లు హాజరు కావడం ఇదే మొదటిసారి.

భారత, అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడడానికి, ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మరింత పటిష్టం కావడానికి ఈ ఈవెంట్ దోహదపడుతుందని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. హోస్టన్ లో జరిగే ఈ కార్యక్రమంలో యుఎస్ హౌస్ లోని మెజారిటీ లీడర్, మేరీలాండ్ లో రెండో అత్యున్నత డెమొక్రాట్ స్టెనీ హోయర్స్ ప్రసంగిస్తారని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే తొలి అమెరికన్-హిందూ కాంగ్రెస్ మహిళా ఎంపీ తులిసీ గబార్డ్, ఇండియన్-అమెరికన్ సెనెటర్ రాజా కృష్ణమూర్తి సహా వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కాంగ్రెస్ సభ్యులు, మేయర్లు, ఇతర అధికారులతో కూడిన ప్రతినిధిబృందం కూడా ఈ మెగా ఈవెంట్ లో పాల్గొననుంది.

మోదీ-ట్రంప్ భేటీ సందర్భంగా ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు కుదురుతాయని, ముఖ్యంగా భారత్ తో తమ వాణిజ్య లావాదేవీలు మరింత పెరగవచ్చునని అమెరికాలోని ఇంధన కంపెనీలు ఆశిస్తున్నాయి. టెక్సాస్ ఇండియా ఫోరమ్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అక్కడి వెయ్యిమంది వాలంటీర్లు, 650 సంస్థల సభ్యులు సహకరిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ ఈవెంట్ లో ట్రంప్ కూడా పాల్గొనబోతున్నారని తెలిసి హర్షం వ్యక్తం చేస్తున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇది ‘ స్పెషల్ గెస్చర్ ‘ అని పేర్కొన్నారు. ఈ నెల 22 న అమెరికాలోని భారతీయులు ఆ సందర్భంగా ట్రంప్ ను ఆహ్వానించబోతున్నారు. ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నాను ‘ అని ఆయన అన్నారు.
మోదీతో గాఢ మైత్రిని కోరుతున్న ట్రంప్- ఈ మెగా ఈవెంట్ కు తాను హాజరుకానున్నానని, ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తన ప్రభుత్వ అధికారులను, సీక్రెట్ సర్వీసును ఆదేశించారు. ఈ ఏడాది ఈ ఇద్దరు నాయకులూ భేటీ కావడం ఇది మూడోసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *