గ్రీన్‌కార్డ్‌ ఆశావహులకు ట్రంప్‌ షాక్‌

Trump Gives Shock To Green Card Aspirants

అమెరికాలో శాశ్వత నివాసం పొందాలనుకునేవారికి భారీ షాకిచ్చింది ట్రంప్‌ సర్కార్‌. గ్రీన్‌కార్డ్‌ జారీ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ప్రభుత్వ పథకాలు అనుభవిస్తున్న వారికి గ్రీన్‌కార్డ్‌ ఇవ్వకూడదని నిర్ణయించింది. ఐతే అదుపుతప్పుతున్న వలసలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రభుత్వంపై ఆర్థికభారం తగ్గించుకునేందుకు ఈ కొత్త నిబంధన తీసుకొచ్చినట్లు ప్రకటించింది శ్వేతసౌధం.

ప్రభుత్వ పథకాలైన ఆహారం, వైద్యం, గృహవసతి వంటి ప్రయోజనాలు పొందుతున్నట్లు తేలితే వాళ్లకు గ్రీన్‌కార్డ్‌ ఇవ్వకూడదని నిర్ణయించింది అగ్రరాజ్యం‌.  గ్రీన్‌కార్డ్‌ పొందినవారికి అమెరికాలో శాశ్వతంగా నివసించే అవకాశంతో పాటు పలు ఇతర ప్రయోజనాలు లభిస్తాయి. దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థికభారం పడుతోందని భావించిన ట్రంప్‌..ఇప్పుడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్‌ నుంచి అమలులోకి రానున్నాయి.

విదేశీయులు వారి సొంత ఆదాయం మీద బతకాల్సి ఉంటుందని..దేశ సంపదను నిర్వీర్యం చేస్తున్నట్లుగా ఉండకూడదని తెలిపారు ఇమ్మిగ్రేషన్‌ అధికారులు. గ్రీన్‌కార్డ్‌ పొందాలనుకునే వారు తాము ప్రభుత్వ సాయంపై ఏ మాత్రం ఆధారపడబోమని నిరూపించుకోవలసి ఉంటుందన్నారు.  ఈ చట్టం 1996 నుంచే ఉన్న కఠినంగా అమలు చేయలేదని.. పన్ను చెల్లింపుదారులపై భారం పడకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.  ఈ నిబంధనల వల్ల గ్రీన్‌కార్డ్‌ ఆశావహులు తమ ఆదాయాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు నిపుణులు. ఇది ఆఫ్రికా, సెంట్రల్‌ అమెరికా, కరీబియన్‌ దీవుల ప్రజలకు పెద్ద షాకేనంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *