గ్రేటర్ ఎన్నికలపై మంత్రి కేటీఆర్‌తో టీవీ9 రజినీకాంత్ స్పెషల్ ఇంటర్వ్యూ

డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు టీవీ9 స్టూడియోకి విచ్చేశారు.

  • Venkata Narayana
  • Publish Date - 9:57 pm, Fri, 27 November 20
గ్రేటర్ ఎన్నికలపై మంత్రి కేటీఆర్‌తో టీవీ9 రజినీకాంత్ స్పెషల్ ఇంటర్వ్యూ

డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు టీవీ9 స్టూడియోకి విచ్చేశారు. ఈ ఆరేళ్ల కాలంలో తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి చెబుతూ.. మరో నాలుగురోజుల్లో జరుగనున్న గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకతను గురించి హైదరాబాదీలకు కేటీఆర్ వివరించారు. విశ్వనగరంగా రూపుదిద్దుకొంటోన్న హైదరాబాద్ భవిష్యత్ కు టీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్.. ఏంటి? గ్రేటర్ ఎన్నికల్లో మరోసారి గెలిస్తే కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పార్టీ నగరంలో తీసుకొచ్చే మార్పులేంటి? ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తున్నదెవరు? అసలు.. గ్రేటర్ వార్ లో టీఆర్ఎస్ టార్గెట్ ఎవరు? ఢిల్లీ పార్టీ కావాల్నా.. గల్లీ పార్టీ కావాల్నా అంటూ నగరవాసుల్ని ప్రశ్నిస్తున్న కేటీఆర్ ఇంకేమంటున్నారో చూద్దాం ..

 

స్థానికంగా ఉండే కార్పొరేటర్ అభ్యర్థుల మీద అభ్యంతరాలుంటే తప్పక సరిదిద్దుతా.. టీఆర్ఎస్ కు ఓటివ్వండి.. వచ్చే మూడున్నరేళ్లలో అద్భుత అభివృద్ధిని చూపిస్తాం: కేటీఆర్

స్థానికంగా ఉండే కార్పొరేటర్ మీద మీకేమైనా అభ్యంతరాలుంటే తప్పక సరిదిద్దుతామని ఈ సారికూడా టీఆర్ఎస్ పార్టీకి ఓటువేయండని కేటీఆర్ హైదరాబాదీలను అభ్యర్థించారు. హైదరాబాద్ లోని నాలాలు, మూసీ నది, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థని పూర్తి స్థాయిలో మూడేళ్లలో పూర్తి చేస్తామని కేటీఆర్ అన్నారు. గుంతల్లేని కాలనీ రోడ్లు రావాలంటే ముందుగా డ్రైనేజ్ వ్యవస్థ బావుండాలని కేటీఆర్ అన్నారు. నేమ్ చేంజర్ కావాలా, గేమ్ చేంజర్ కావాలా హైదరాబాద్ ఓటర్లు తేల్చుకోవాలని కేటీఆర్ అన్నారు. ఈ పిచ్చోళ్ల చేతిలో హైదరాబాద్ ని పెట్టొద్దని పరోక్షంగా బీజేపీ, ఎంఐఎం పార్టీలపై కామెంట్ చేశారు కేటీఆర్. డిసెంబర్ 4వ తేదీన దూద్ కా దూద్, పానీ కా పానీ అవుతుందని.. చూడండని కేటీఆర్ అన్నారు.

 

ఓటమిలో గుణపాఠాలు, గెలుపులోనూ పాఠాలు ఉంటాయని తమకు కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారు: కేటీఆర్

ఓటమిలో గుణపాఠాలు, గెలుపులోనూ పాఠాలు ఉంటాయని తమకు కేసీఆర్ ఎప్పుడూ చెబుతుంటారని కేటీఆర్ అన్నారు. మొన్నటి పార్లమెంట్, దుబ్బాక ఈ రెండిటిలో తప్ప తమకు ఆరేళ్లలో ఇప్పటివరకూ జరిగిన ఈ అన్ని ఎన్నికల్లోనూ అనూహ్యమైన ఫలితాలు టీఆర్ఎస్ కు వచ్చాయని కేటీఆర్ చెప్పారు. అయితే, కేవలం దుబ్బాకనే పెద్ద వార్తగా మీడియాలో చూపిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షం ఉండకూడదని మేమనుకున్నంత మాత్రాన అది జరగదని.. అది ప్రజల చేతిలో ఉందని కేటీఆర్ అన్నారు. దుబ్బాక ఎన్నికల్లో తప్పకుండా మేము ఆశించిన ఫలితం రాలేదన్నది విశ్లేషించుకుని ముందుకు వెళ్తున్నామని కేటీఆర్ అన్నారు. డిసెంబర్ 4న వచ్చే ఫలితాన్ని చూస్తే అది మీకు అర్థమవుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

 

హైదరాబాద్ కు లక్షకోట్ల ప్యాకేజీ ఇవ్వమనండి.. మాట్లాడదాం: కేటీఆర్

వర్షాలతో హైదరాబాద్ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వీరెవరన్నా కనబడ్డారా అని ప్రశ్నించారు కేటీఆర్. హైదరాబాద్ కు బీజేపీ పెద్దలు రావొచ్చు.. దానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారాయన. అయితే, కేంద్రంలోని పెద్దలు మోదీ, అమిత్ షా, హైదరాబాద్ కు లక్షకోట్ల ప్యాకేజీ ఇవ్వమనండి మాట్లాడదాం అని కేటీఆర్ అన్నారు. కర్నాటక, గుజరాత్ లకు తక్షణ సాయం ఇస్తారు.. తెలంగాణకు ఎందుకు ఇవ్వరని కేంద్రాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అడిగిన1350 కోట్లు పెన్షన్ సాయం తీసుకొని రావాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పాతబస్తీలో రొహింగ్యాలు ఉన్నారు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ బీజేపీ నేతలు చెబుతున్నారని, అయితే, మరి ఈ ఆరేళ్ల కాలంలో మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తదితరులు ఏంచేశారని కేటీఆర్ ప్రశ్నించారు.

 

మ్యాజిక్ ఫిగర్ 75 సీట్ల కంటే జీహెచ్ఎంసీలో ఈజీగా ఎక్కువ సీట్లు సాధిస్తాం : కేటీఆర్

75 స్థానాలు ఈజీగా గెలుచుకుని హైదరాబాద్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామని కేటీఆర్ అన్నారు. గౌరవప్రదమైన స్థానంలో ఈ దఫా ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కేటీఆర్ చెప్పారు. ఆల్రెడీ గోల్కొండ, బల్దియాలపై ఇప్పటికే జెండా ఎగురవేశామని కేటీఆర్ అన్నారు. ఎంఐఎంతో పొత్తు పరిస్థితి తలెత్తే పరిస్థితి ఎట్టిపరిస్థితుల్లో రాదని కేటీఆర్ అన్నారు.

 

ఈ బాబరెవరు, అక్బర్ ఎవరు..? పిచ్చిమాటలు మాట్లాడితే పార్టీలకతీతంగా కఠినంగా శిక్షిస్తాం : కేటీఆర్

మతం ముసుగులో ముస్లింలను కించ పరిచేవిధంగా మాట్లాడ్డం సరికాదని కేటీఆర్ అన్నారు. ఈ బాబరెవరు, అక్బర్ ఎవరు? హైదరాబాద్ ఎన్నికల్లో వీటికేం సంబంధం అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ అరాచకపు రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. పాతబస్తీలో రొహింగ్యాలు అంటున్న కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీ ఈ ఆరేళ్ల కాలంలో గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు సహా బీజేపీ, ఎంఐఎం ఇలా.. ఎవరైనా ప్రజలని మతంకులం పేరుతో రెచ్చగొట్టే పనులు చేస్తే తప్పకుండా కఠినంగా శిక్షిస్తామని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

 

ఎన్నికలతో సంబంధం లేకుండా ఈ ఐదేళ్లలో హైదరాబాద్ లో ఎలాంటి పన్నులు పెంచలేదు : కేటీఆర్

ఈ ఆరేళ్లలో హైదరాబాద్ నగర వాసులకు ఎలాంటి అదనపు పన్నులు వేయలేని విషయాన్ని గుర్తించాలని కేటీఆర్ అన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్, రిజిస్ట్రేషన్, వాటర్ బిల్లులు, వంటి ఎలాంటి పన్నులు పెంచిన సందర్బం లేనే లేదని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ పేరు మీద పదివేల కోట్ల రూపాయలు సీఎం కేసీఆర్ ప్రతీ ఏడాది కేటాయించారని కేటీఆర్ అన్నారు. ఎన్నికలతో నిమిత్తం లేకుండా హైదరాబాద్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని కేటీఆర్ అన్నారు.

 

తారామతి దగ్గర 40 ఎకరాల్లో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ థియేటర్ : కేటీఆర్

ఢిల్లీలో కింగ్ డం ఆఫ్ డ్రీమ్స్ తరహాలో హైదరాబాద్ లో తారామతి బారాదరి ప్రాంతంలో 40 ఎకరాల్లో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ థియేటర్ భారీ స్థాయిలో నిర్మిస్తామని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ సీఎం అయిన మొదట్లోనే హైదరాబాద్ ఇజ్జత్ నగర్ లో హైదరాబాద్ హేబిటేట్ సెంటర్ నిర్మించాలని ప్లాన్ చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే, అది టేక్ ఆఫ్ అవలేదని అన్నారు. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ థియేటర్ నిర్మాణంతో తెలంగాణతోపాటు, అన్ని సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ఇది నెలవవుతుందని కేటీఆర్ అన్నారు.

 

ఒక్క ఐటీ జోన్ లోనేకాదు.. నగరంలోని అన్ని మూలలా అభివృద్ధి చేస్తున్నాం: కేటీఆర్

నగరంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. అయితే, జనసామర్ధ్యం, జన సాంధ్రత, ప్రత్యక్ష, పరోక్ష ఉపాది అవకాశాలు ఎక్కువగా ఉన్నచోట ప్రయారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం గుర్తించాలని కేటీఆర్ అన్నారు. శేరిలింగంపల్లి పరిధిలో ఐదు లక్షలమంది ఐటీ ఉద్యోగులు, వీరిపై పరోక్షంగా మరో ఐదు లక్షల మంది ఉపాది పొందుతున్నారని అందువల్ల ఆ ప్రాంతంలో జన తాకిడి ఎక్కువగా ఉందని అందుకే అక్కడ ప్రయారిటీ ఎక్కువగా తీసుకుని అభివృద్ధి చేస్తున్నామని, అలా అని మిగతా ప్రాంతాలను అలస్యం చేయడంలేదని, బాలనగర్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజ్ గిరి, వంటి ప్రాంతాల్లోనూ అనేక అభివృద్ధి పనులు చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు.

 

పాతబస్తీ వరకూ మెట్రోరైలు పొడిగించలేదన్న విషయంపై కేటీఆర్ స్పష్టత

పాతబస్తీ వరకూ మెట్రో ఎందుకు పొడిగించలేదన్న విషయంపై కేటీఆర్ స్పష్టత నిచ్చే ప్రయత్నం చేశారు. మొదట్లో రూపొందించిన అలైన్ మెంట్ మార్చాలని పాతబస్తీవాసులు కోరడం, మరికొన్ని అభ్యంతరాలు స్థానికంగా లేవనెత్తడంతో పని ప్రారంభించడంలో ఆలస్యమైందన్నారు. ముందుగా అభ్యంతరంలేని ప్రాంతాల్లో నిర్మాణం చేపడతామని ఎల్ అండ్ టీ నిర్మాణ సంస్థ చెప్పి ఆదిశగా పని ప్రారంభించిందని కేటీఆర్ అన్నారు. త్వరలోనే అన్ని సమస్యల్ని పరిగణలోకి తీసుకుని వాటికి పరిష్కారమార్గాలు కనుగొని పాతబస్తీలోనూ మెట్రో రైల్ తీసుకెళతామని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే ఈ పని పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ కరోనా లాక్ డౌన్ వల్ల మెట్రో స్థంభించిపోయిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు.

 

111 లొకేషన్లలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లను టీవీ9 బృందాల్ని పంపించి చెక్ చేయించండి: కేటీఆర్

డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ విషయంలో ఎందుకు ఆలస్యమైందో చెప్పే ప్రయత్నం చేశారు కేటీఆర్. దేశంలోని ఏ ప్రధాన నగరంలోనూ లేని విధంగా పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇవ్వడం ఒక రికార్డని కేటీఆర్ అన్నారు. 90శాతం ఇళ్ల నిర్మాణం 111 లొకేషన్లలో కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లను కావాలంటే చెక్ చేసుకోండని కేటీఆర్ అన్నారు. వీటన్నింటినీ వందశాతం పూర్తిచేసి పేదప్రజలకు త్వరలోనే అందిస్తామని కేటీఆర్ చెప్పారు. కరోనా లాక్ డౌన్ వల్ల ఇళ్ల నిర్మాణంలో కొంత ఆలస్యం అయిందని కేటీఆర్ అన్నారు.