ఇందూరులో బంపర్ మెజారిటీయే లక్ష్యంః గులాబీ నేతలు

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేక ఫోకస్ చేసింది. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీయే లక్ష్యంగా పావులు కదుపుతోంది.

ఇందూరులో బంపర్ మెజారిటీయే లక్ష్యంః గులాబీ నేతలు
Follow us

|

Updated on: Sep 29, 2020 | 7:13 PM

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలపై తెలంగాణ రాష్ట్ర సమితి ప్రత్యేక ఫోకస్ చేసింది. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీయే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అక్టోబర్ 9 న జరగనున్న నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొందేందుకు పకడ్బందీ వ్యూహం పన్నుతోంది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా పోటీ చేస్తుండడంతో ఈ ఎన్నికను పార్టీ క్యాడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జిల్లాలో అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఉండటంతో కవిత గెలుపు లాంఛనం కానుంది. అయితే, భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించాలని భావిస్తున్న టిఆర్ఎస్, అందుకు తగ్గట్టే ప్రణాళికలు రచిస్తోంది. ఉప ఎన్నికల బాధ్యతలు తీసుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పార్టీశ్రేణులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రోజు హైదరాబాదులో లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమావేశమయ్యారు. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత సైతం పాల్గొన్న ఈ సమావేశంలో, ఎన్నికల కార్యాచరణ, బాధ్యతల నిర్వహణ గురించి చర్చించారు. తాజాగా మంగళవారం రోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎంపీలు సురేష్ రెడ్డి, బిబి పాటిల్ ఎమ్మెల్సీలు రాజేశ్వర్ రావు,వి.గంగాధర్ గౌడ్, ఆకుల లలిత, జెడ్పి చైర్మన్ విఠల్ రావు, మాజీ చైర్మన్ దఫెదర్ రాజు మంత్రి ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు.

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం 824 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి 505 మంది ప్రజాప్రతినిధులు గెలుపొందగా, కాంగ్రెస్ 140, బిజెపి 84, ఎంఐఎం 28, స్వతంత్రులు 66 మంది ఉన్నారు. అయితే, ఎన్నికల అనంతరం స్వతంత్ర సభ్యులతోపాటు, కాంగ్రెస్ బిజెపి లకు చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు చాలా వరకు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో 80 శాతం మంది స్థానిక ప్రజాప్రతినిధుల టిఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తున్నారు. వాస్తవానికి 413 ఓట్లు సంపాదిస్తే ఎమ్మెల్సీ గెలుపు ఖాయం. కానీ, ఇప్పటికే 505కు పైగా టీఆర్ఎస్ ఓటర్లు ఉన్న నేపథ్యంలో కవిత గెలుపు సునాయసం. అయినప్పటికీ భారీ మెజారిటీయే లక్ష్యంగా టీఆర్ఎస్ అధిష్టానం పావులు కదుపుతోంది.

దీనికితోడు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యాక, ఇతర పార్టీలకు చెందిన పలువురు స్థానిక ప్రజా ప్రతినిధులు కవితకు అభ్యర్థుత్వానికి మద్దతుగా టీఆర్ఎస్ నేతలతో టచ్ లోకి వస్తున్నారు. దీంతో పోలింగ్ తేదీ నాటికి టిఆర్ఎస్ కు 90 శాతం మంది స్థానిక ప్రజాప్రతినిధులు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని పార్టీ జిల్లా నేతలు భావిస్తున్నారు. అయితే, పోలింగ్ పూర్తయ్యేవరకు ఏమాత్రం ఏమరుపాటుగా ఉండకూడదని టిఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా నేతలకు బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు, పోలింగ్ తేదీ లోపే ఓటర్లందరికీ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే తీరుపై అవగాహన కల్పించాలని నేతలు అభిప్రాయపడ్డారు.

ఏది ఏమైనప్పటికీ, అక్టోబర్ 9 న జరిగే ఎమ్మెల్సీ ఉపఎన్నికలలో మాజీ ఎంపీ కవిత భారీ మెజారిటీతో గెలిచి, చరిత్ర సృష్టించడం ఖాయమంటున్నారు ఇందూరు గులాబీ నేతలు.