మరి.. శబరిమల విషయం మరిచారా?- ఓవైసీ

Asaduddin Owaisi about Triple Talaq Bill, మరి.. శబరిమల విషయం మరిచారా?- ఓవైసీ

ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించే రక్షణ బిల్లు-2019ను కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లుపై లోక్‌సభలో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.  అన్ని పార్టీలతో సంప్రదించి విస్తృతంగా చర్చించిన తర్వాతే బిల్లును సభలో ప్రవేశపెట్టాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. అటు కాంగ్రెస్ సభ్యుడు శశిథరూర్ కూడా ఈ బిల్లు పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశం వ్యాప్తంగా ఒకే విధమైన చట్టం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. విపక్షాల అభ్యంతరాల మధ్యే స్పీకర్ ఓం బిర్లా బిల్లుపై చర్చకు వాయిస్ ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 186 ఓట్లు, వ్యతిరేకంగా 78 ఓట్లు పోల్ అవడంతో ట్రిపుల్ తలాక్ అంశాన్ని చర్చకు స్వీకరించినట్టయింది.

కాగా హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ బిల్లును వ్యతిరేకించారు. ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకురావడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,15లను ఉల్లంఘించడమే అని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్ చెప్పినంత మాత్రాన వివాహ బంధం ముగిసినట్టు కాదని గతంలో సుప్రీం కోర్టు చెప్పిన విషయాన్ని నాయకులు గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. అసలు శిక్షల్లోనూ సమానత్వం ఎక్కడుంది? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముస్లింమేతరులు తమ భార్యలను వదిలిపెడితే సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ.. ముస్లిం మహిళల భర్తలకు మాత్రం ఇదే నేరంపై మూడేళ్లు జైలు శిక్ష విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బిల్లు ద్వారా ముస్లిం వర్గాలకు కొత్తగా వచ్చే ఆత్మగౌరవం ఏమీ లేదన్న అసద్.. ముస్లిం మహిళలపై ఇంత దృష్టి పెట్టిన ప్రభుత్వం మరి శబరిమలకు వెళ్లాలనుకునే మహిళల గురించి ఎందుకు పట్టించుకోదని ప్రశ్నించారు.

గత ఎన్డీయే ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్డినెన్స్ ద్వారా ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లును తీసుకొచ్చింది. కాగా రాజ్యసభలో ఈ బిల్లుకు  ఆమోదం లభించకపోవడం.. మరో 40 రోజుల్లో ఆర్డినెన్స్ కాల పరిమితి పూర్తవుతుండటతో ఈసారైనా ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందేలా చూడాలని మోదీ సర్కార్ భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *