బాత్‌టబ్‌లో ముంచి.. భార్యను హత్య చేసిన భర్త

Trial begins for husband accused of murdering wife in 2007, బాత్‌టబ్‌లో ముంచి.. భార్యను హత్య చేసిన భర్త

లేటెస్ట్ టెక్నాలజీ యుగంలో పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగులుతున్నాయి. కారణమేదైనా మూడుముళ్ల బంధాన్ని ఈజీగా తెంచేసుకుంటున్నారు భార్యభర్తలు. అయితే ఈ విడాకులు కొన్నిసార్లు ప్రాణాలనూ తీసేస్తున్నాయి. ఇప్పుడిదే జరిగింది అమెరికాలో. డైవర్స్ కోసం దంపతుల మధ్య ఘర్షణలో భార్యనే హతమార్చాడు భర్త. ఎనిమిదేళ్ల విచారణ తర్వాత అతన్ని దోషిగా తేల్చిన కోర్టు.. ఆగస్టు 23న శిక్ష ఖరారు చేయనుంది.

భారత సంతతికి చెందిన అవతార్ గైవాల్, నవనీత్ కౌర్‌లకు 2005లో వివాహం జరిగింది. అయితే అవతార్‌కు కెనడాలో ఉద్యోగం చేస్తుండగా.. నవనీత్‌ అమెరికాలో ఉద్యోగం చేస్తోంది. దీంతో పెళ్లైన కొద్ది రోజులకే ఈ దంపతులిద్దరూ ఆయా ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అవి క్రమంగా పెరిగి విడాకులకు దారి తీశాయి.

రెండేళ్ల తర్వాత భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్న నవనీత్.. భర్తకు విషయం చెప్పింది. అయితే అవతార్ అందుకు నిరాకరించడంతో మాట్లాడుకుందామని భర్తను ఇంటికి పిలిచిన నవనీత్.. ఎయిర్ పోర్టుకు వెళ్లి మరీ అతన్ని రిసీవ్ చేసుకుంది. ఫీనిక్స్ శివారులోని అహ్వాటుకీలోని తన ఇంటికి తీసుకెళ్లి విడాకుల గురించి చర్చిస్తుండగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీంతో కోపంతో ఊగిపోయిన అవతార్.. భార్యను బాత్‌టబ్‌లో ముంచి ఊపిరాడకుండా చంపేశాడు. అనంతరం కెనడాకు వెళ్లిపోయాడు.

తమ బిడ్డను అల్లుడు చంపేశాడన్న విషయం తెలుసుకొని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు నవనీత్ కుటుంబసభ్యులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అతన్ని 2011లో అరెస్ట్ చేసి అమెరికాకు తీసుకొచ్చారు. ఈ కేసులో దాదాపు ఎనిమిదేళ్ల పాటు విచారణ అనంతరం అతన్ని దోషిగా తేల్చిన కోర్టు.. ఆగస్ట్ 23న శిక్ష ఖరారు చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *