హైవేలపై సైన్ బోర్డులు గ్రీన్ కలర్‌లోనే ఎందుకు ఉంటాయో తెలుసా? అసలు రహస్యం ఇదే..!
Traffic Sign Board Colors Meaning: రహదారులపై ఉండే ఈ పచ్చ రంగు మార్గదర్శక బోర్డులు ప్రయాణికులకు సురక్షితమైన, ఒత్తిడి లేని ప్రయాణ అనుభవాన్ని అందిస్తాయి. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలలో హైవే బోర్డుల కోసం పచ్చ రంగునే ప్రామాణికంగా ఉపయోగిస్తున్నారు. ఈ బోర్డులు వాహనదారులను సరైన దిశలో నడిపించడమే కాకుండా, ఊహించని ప్రమాదాలను నివారించి సురక్షిత ప్రయాణానికి బలమైన పునాదిగా నిలుస్తున్నాయి.

Highway Green Boards Reason: జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు ఆకు పచ్చటి బోర్డులపై తెల్లటి అక్షరాలతో రాసి ఉన్న ఊర్ల పేర్లు, కిలోమీటర్ల వివరాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే, మిగిలిన రంగులన్నీ వదిలేసి కేవలం పచ్చ రంగునే ఎందుకు వాడుతారో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక డ్రైవర్ల భద్రతకు సంబంధించిన ఆసక్తికరమైన సైన్స్, మానసిక కారణాలు దాగి ఉన్నాయి. ఆ విశేషాలు మీకోసం.
రంగుల వెనుక ఉన్న ట్రాఫిక్ రహస్యాలు..
ట్రాఫిక్ నిబంధనల ప్రకారం రహదారులపై ఉపయోగించే ప్రతి రంగుకు ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. వేగంగా వెళ్లే వాహనదారులు దూరం నుంచే విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ రంగుల సూచికలను ఏర్పాటు చేశారు. ఉదాహరణకు, ఎరుపు రంగు ప్రమాదాన్ని లేదా వాహనాన్ని వెంటనే నిలిపివేయాలనే హెచ్చరికను సూచిస్తుంది. పసుపు రంగు డ్రైవర్లను అప్రమత్తం చేయడానికి, నీలం రంగు సమీపంలో ఉన్న ఆసుపత్రి, పెట్రోల్ బంక్ లేదా విశ్రాంతి గదుల వంటి ప్రజా సౌకర్యాలను తెలియజేయడానికి ఉపయోగిస్తారు. వీటన్నింటికీ భిన్నంగా, కేవలం మార్గదర్శకత్వం, దిశలను చూపించడానికి మాత్రమే పచ్చ రంగు బోర్డులను కేటాయించారు.
ఇది కూడా చదవండి: Video: ఓపికను టెస్ట్ చేస్తే ఇలాగే ఉంటది.. బుడ్డోడి దూల తీరిపోయిందిగా.. ఇదిగో వీడియో
కళ్లకు ఉపశమనం.. మనస్సుకు ప్రశాంతత..
హైవే బోర్డుల కోసం పచ్చ రంగును ఎంచుకోవడానికి ప్రధాన కారణం మానవ కంటి నిర్మాణం, మెదడు పనిచేసే తీరేనని నేత్ర నిపుణులు చెబుతున్నారు. ఇతర రంగులతో పోలిస్తే పచ్చ రంగును చూసినప్పుడు కళ్లపై ఎలాంటి ఒత్తిడి పడదు. ఎంత సమయం చూసినా కళ్లు అలసిపోవు సదా దృష్టికి మేలు జరుగుతుంది. గంటల తరబడి సుదీర్ఘ ప్రయాణాలు చేసే డ్రైవర్లకు ఇది ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా, పచ్చ రంగు ప్రకృతిని, ప్రశాంతతను ప్రతిబింబిస్తుంది. ఇది వాహనదారుల మనస్సును ప్రశాంతంగా ఉంచి, రోడ్డుపై మరింత ఏకాగ్రతతో వాహనం నడిపేలా ప్రోత్సహిస్తుంది.
పగలే కాదు.. చీకట్లోనూ స్పష్టత..
పచ్చ రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై తెల్లటి అక్షరాలు రాయడం వల్ల పగటిపూట సూర్యకాంతిలోనూ, రాత్రి వేళ చీకట్లోనూ బోర్డులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. రాత్రి సమయంలో వాహనాల హెడ్‌లైట్ల వెలుతురు ఈ బోర్డులపై పడగానే అక్షరాలు మెరిసిపోయేలా ప్రత్యేక సాంకేతికతను ఉపయోగిస్తారు. దీనివల్ల దట్టమైన చీకటి లేదా మంచు కురిసే సమయాల్లో సైతం డ్రైవర్లు చాలా దూరం నుంచే దారిని, ఊర్ల పేర్లను సులభంగా గుర్తించగలరు. కొన్ని నగరాల్లో స్థానిక రహదారులను సూచించడానికి నీలి రంగు బోర్డులను కూడా వాడుతుంటారు. దీనివల్ల తాము ఏ రకమైన రోడ్డుపై వెళ్తున్నామో వాహనదారులకు సులభంగా అర్థమవుతుంది.
మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




