అక్బరుద్దీన్‌ ఒవైసీకి విజయశాంతి స్ట్రాంగ్ కౌంటర్.. ఎర్రగడ్డ ప్రభావం వల్లే ఆ వ్యాఖ్యలు అంటూ..

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార బరిలోకి నేరుగా దిగకపోయినా.. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి పార్టీల నాయకులను రఫ్సాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకురాలు విజయశాంతి.

అక్బరుద్దీన్‌ ఒవైసీకి విజయశాంతి స్ట్రాంగ్ కౌంటర్.. ఎర్రగడ్డ ప్రభావం వల్లే ఆ వ్యాఖ్యలు అంటూ..
Follow us

|

Updated on: Nov 26, 2020 | 12:47 PM

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార బరిలోకి నేరుగా దిగకపోయినా.. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి పార్టీల నాయకులను రఫ్సాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకురాలు విజయశాంతి. తాజాగా ఎన్టీఆర్, పీవీ ఘాట్‌లను కూల్చాలంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు విజయశాంతి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అక్బరుద్దీన్ ఎర్రగడ్డలో ప్రసంగించారని, ఆ స్థల ప్రభావం చేత ఆయన అలా మాట్లాడి ఉంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఫేసు‌బుక్ వేదికగా స్పందించిన విజయశాంతి.. ‘ఆక్రమణల పేరుతో పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చమని అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేస్తే.. మరి కొందరు ప్రజలు ఎఫ్‌టీఎల్ వాటర్ సమస్యలో ఉంది కాబట్టి తాజ్‌మహల్‌ని కూల్చమని, ట్రాఫిక్‌కు అడ్డంగా ఉందని చార్మినార్‌ను కూల్చమని కూడా అడుగుతారు. ఎర్రగడ్డ ప్రాంతంలో పర్యటన సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ ఈ విధమైన ప్రకటనచేసినందున.. స్థల ప్రభావం చేత ఆయన అలా మాట్లాడి ఉంటారని భావించి స్పదించనవసరం లేదని భావిస్తున్నాను’ అంటూ తనదైన శైలిలో అక్బరుద్దీన్ ఒవైసీకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

కాగా, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆమె.. ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఆమె బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా విపరీతంగా జరిగింది. ఈ ప్రచారంపై ఆమె నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందనా రాలేదు. ఇప్పటికే దుబ్బాక ఎన్నికల వేళ కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి విజయశాంతిని కలిసి చర్చలు జరిపారు. అటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా విజయశాంతిపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.