జీహెచ్ఎంసీ ఎన్నికల హీట్.. రోహింగ్యాలు వస్తుంటే కేంద్రం ఏం చేస్తోంది.. నిలదీసిన కవిత..

ఓవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది.. మరోవైపు రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం పర్వం ముగియనుంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల హీట్.. రోహింగ్యాలు వస్తుంటే కేంద్రం ఏం చేస్తోంది.. నిలదీసిన కవిత..
Follow us

|

Updated on: Nov 27, 2020 | 9:02 PM

ఓవైపు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతోంది.. మరోవైపు రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం పర్వం ముగియనుంది. దీంతో ప్రధాన పార్టీల నేతలు తమ మాటల పదునును మరింత పెంచారు. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్‌లో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. అక్కడి సభికులనుద్దేశించి ప్రసంగించిన కవిత.. బీజేపీపై ఒక రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతలు నోరు తెరిస్తే హిందూ ముస్లిం అంటూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారే తప్ప.. నగరానికి, ప్రజలకు ఏం చేస్తారనే విషయాన్ని మాత్రం చెప్పడం లేదని నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లో రోహింగ్యాలు ఉన్నారంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన ఎమ్మెల్సీ కవిత.. రోహింగ్యాలు వస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు.

దేశ సరిహద్దులు దాటి హైదరాబాద్‌కు రోహింగ్యాలు వస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం కాదా? అని బీజేపీ నేతలను ఆమె తూర్పారబట్టారు. రోహింగ్యాలకు గుర్తింపు కార్డులు ఇస్తున్నారంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను సైతం ఆమె తోసిపుచ్చారు. ఓట్లు, ఆధార్ కార్డు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే కదా? అని కవిత ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య వైషమల్యాలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ఏమాత్రం సాయం చేయలేదని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో నిర్మించిన ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని దుయ్యబట్టారు. కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుందన్నారు. కరోనా సమయంలో ఆదుకున్నది… వరదలు వచ్చినప్పుడు అండగా ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్‌లో 5.50 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టీఆర్ఎస్‌కు ఓటు వేసి హైదరాబాద్ అభివృద్ధికి దోహద పడాలని ప్రజలకు కవిత పిలుపునిచ్చారు.