అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కొత్త బిజినెస్ ప్రారంభించారు. కొత్తగా ఎలక్ట్రిక్ గిటార్ ల వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే, ఈ గిటార్‌లను ఎంతో ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ గిటార్‌లో అమెరికా జెండా, ఈగల్ బొమ్మలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే స్లోగన్‌ను ముత్యాలతో రాసి పొదిగినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు..గిటార్‌లోని 45 నంబరు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను సూచిస్తుంది. ఇక ఆ గిటార్లలో కొన్నింటిపై ట్రంప్ సంతకం చేసినవి కూడా ఉన్నాయి. ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ వ్యాపారాన్ని ప్రకటించారు.
ఇకపోతే, ఈ గిటార్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ట్రంప్ గిటార్స్ వెబ్‌సైట్ వెల్లడించింది. మొత్తం 1,300 గిటార్లు విక్రయిస్తుండగా అందులో దాదాపు వెయ్యికి పైగా గిటార్లు సాధారణమైనవిగా పేర్కొంది.. వాటిని 1,250 డాలర్ల నుంచి 1,500 డాలర్లకు విక్రయిస్తుంది. ఇక ట్రంప్ ఆటోగ్రాఫ్‌తో కూడిన ఎలక్ట్రిక్ గిటార్లకు ప్రత్యేక ధరను నిర్ణయించారు. ట్రంప్ సంతకం చేసిన గిటార్ల ధర10వేల డాలర్లు (రూ.8.45లక్షలు)గా ప్రకటించారు.. అయితే, అవి కేవలం 275 మాత్రమే ఉన్నాయట.
ఈ స్పెషల్ గిటార్‌ని సొంతం చేసుకోవాలంటే 10 వేల డాలర్లు (రూ. 8.45లక్షలు) చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం నాలుగు రకాల గిటార్లను విక్రయిస్తామని ‘ట్రంప్ గిటార్స్’ వెబ్‌సైట్ పేర్కొంది. కాగా, ట్రంప్ గతంలోనే బైబిల్స్, వాచీల బిజినెస్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..