మంత్రి మల్లారెడ్డిపై కేసు.. భూమిని ఆక్రమించాడంటున్న మహిళ.. తాను ఏ కబ్జా చేయలేదంటున్న మంత్రి

తన తల్లి పేరుపై ఉన్న భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని శ్యామలాదేవి అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు. మంత్రి అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆమె పేర్కొన్నారు.

మంత్రి మల్లారెడ్డిపై కేసు.. భూమిని ఆక్రమించాడంటున్న మహిళ.. తాను ఏ కబ్జా చేయలేదంటున్న మంత్రి
Follow us

|

Updated on: Dec 09, 2020 | 11:37 AM

TS Labour Minister Malla Reddy: తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. ఓ మహిళకు చెందిన భూమిని ఆక్రమించడనే ఆరోపణలపై దుండిగల్‌ పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అలాగే తన భూమిని రిజ్రిస్టేషన్‌ చేయించాలంటూ బెదిరిస్తున్నాడని బాధితురాలు పేర్కొంది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన తల్లి పేరుపై ఉన్న భూమిని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని శ్యామలాదేవి అనే మహిళ హైకోర్టును ఆశ్రయించారు. మంత్రి అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆమె పేర్కొన్నారు. దీంతో వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.

బాధితురాలు శ్యామలాదేవి తల్లి పొన్నబోయిన పద్మావతి పేరుపై సూరారం సర్వే నంబర్‌ 115, 116, 117లలో 2.13 ఎకరాల భూమి ఉంది. దీన్ని తనకు ఇవ్వాలంటూ మంత్రి బెదిరించాడట. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదని బాధితురాలు అన్నారు. తన తల్లి పద్మావతితో కలిసి కోర్టులో మల్లారెడ్డిపై భూవివాదానికి సంబంధించిన పిటిషన్‌ వేసేందుకు న్యాయవాది లక్ష్మీనారాయణను ఆశ్రయిస్తే ఆయన కూడా మోసం చేశారు. మంత్రితో చేతులు కలిపిన లాయర్ బాధితులనుంచి స్టాంప్‌ పేపర్‌పై సంతకాలు తీసుకున్నారు. అలా నకిలీ అగ్రిమెంట్‌ పేపర్లను తయారు చేశారు. కొన్ని నెలల క్రితమే శ్యామలాదేవి తల్లి పద్మావతి, సోదరి మరణించారు. తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది.

మల్లారెడ్డికి చెందిన రెండు ఆస్పత్రుల మధ్యలో శ్యామలకు చెందిన భూమి ఉండడంతో తనకు ఆ ల్యాండ్ విక్రయించాలంటూ బెదిరించారని బాధితురాలు ఆరోపించారు. తాను నిరాకరించేసరికి భూమిని ఆక్రమించి కాంపౌండ్ వాల్ కట్టేశారట. తమ భూమిలోకి తననే అడుగు పెట్టనివ్వడం లేదంటూ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసుతో తనకెలాంటి సంబంధం లేదని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. తాను భూమిని కబ్జా చేశాననడంలో వాస్తవం లేదన్నారు.