నేడు హైదరాబాద్‌కు రానున్న ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్‌.. టీపీసీసీ చీఫ్ ఎంపికకు అభిప్రాయ సేకరణ

మాణికం ఠాగూర్‌ ఆధ్వర్యంలో ఏఐసీసీ బృందం హైదరాబాద్ రానుంది. కాంగ్రెస్ రాష్ట్ర నేతలతో ఆయన సమాలోచనలు చేయనున్నారు. ఇక గురువారం నుంచి పార్టీలోని అన్ని స్థాయిల నేతల నుంచి అభిప్రాయాల సేకరణ చేయనున్నారు

  • Anil kumar poka
  • Publish Date - 8:48 am, Wed, 9 December 20
నేడు హైదరాబాద్‌కు రానున్న ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్‌.. టీపీసీసీ చీఫ్ ఎంపికకు అభిప్రాయ సేకరణ

TPCC chief post: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియపై ఆ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. దీంతో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్‌కు ఆ పార్టీ అధిష్టానం కీలక ఆదేశాలిచ్చింది. బుధవారం మాణికం ఠాగూర్‌ ఆధ్వర్యంలో ఏఐసీసీ బృందం హైదరాబాద్ రానుంది. కాంగ్రెస్ రాష్ట్ర నేతలతో ఆయన సమాలోచనలు చేయనున్నారు. ఇక గురువారం నుంచి పార్టీలోని అన్ని స్థాయిల నేతల నుంచి అభిప్రాయాల సేకరణ చేయనున్నారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలతో సంప్రదింపులు చేపడతారు. రాష్ట్రంలో అన్ని స్థాయిలలోని పార్టీ నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులతో విడివిడిగా సమావేశం నిర్వహిస్తారు. తర్వాత అభిప్రాయాల నివేదికను సోనియా, రాహుల్ గాంధీకి ఠాగూర్ ఇవ్వనున్నారు. ఎలాంటి వివాదాలు రాకుండా మెజారిటీ నేతల అభిప్రాయానికి ఆమోదం తెలపాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఆ పదవిపై కాంగ్రెస్ లోని చాలా మంది నేతల కన్ను పడింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత తన పదవికి రాజీనామా చేస్తూ ఉత్తమ్ అధిష్టానికి లేఖ రాశారు. తర్వత పీసీసీ చీఫ్ పదవికి తాము అర్హులమంటూ కొందరు నేతలు స్టేట్‌మెంట్లు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే అభిప్రాయ సేకరణలో ఏం తేలనుంది, తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎవరు అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.