సుప్రీంకు నలుగురు జడ్జిల నియామకానికి ఓకే..

Top Court Gets 4 New Judges As Collegium Overrules Centre's Objections, సుప్రీంకు నలుగురు జడ్జిల నియామకానికి ఓకే..

సుప్రీంకోర్టుకు నలుగురు న్యాయమూర్తుల నియామకానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రపతి సంతకం అనంతరం దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ ఏ ఎస్ బోపన్న, జస్టిస్ బీ ఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందుతున్నారు. వీరి నియామకాలకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

జస్టిస్ బోస్, జస్టిస్ బోపన్నలకు పదోన్నతి కల్పించాలన్న కొలీజియం సిఫారసులను గతంలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదు. వీరి సీనియారిటీ, ప్రాంతీయతలను కారణాలుగా చూపుతూ అభ్యంతరం వ్యక్తం చేసింది.

జస్టిస్ బోస్ జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ, జస్టిస్ బోపన్న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ పనిచేస్తున్నారు. జస్టిస్ గవాయ్ బోంబే హైకోర్టు జడ్జిగానూ, జస్టిస్ కాంత్ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ పని చేస్తున్నారు.

సుప్రీంకోర్టులో మొత్తం 31 మంది జడ్జిలను నియమించేందుకు అనుమతి ఉంది. ప్రధాన న్యాయమూర్తితో సహా 31 మంది న్యాయమూర్తులు ఉండాలి. ఇప్పటి వరకు 27 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. తాజాగా నలుగురిని నియమిస్తే అనుమతి ఉన్న సంఖ్యలో న్యాయమూర్తులను నియమించినట్లవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *