ఈ పది తెలుగు సినిమాలు కచ్చితంగా చూడాల్సిందే..

మూసకథలంటూ ఒకప్పుడు టాలీవుడ్‌ను చిన్న చూపు చూసిన పలు ఇండస్ట్రీలు ఇప్పుడు మన తెలుగు సినిమా వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా బాహుబలి చిత్రం తరువాత టాలీవుడ్ స్థాయి ప్రపంచవ్యాప్తంగా మరింత పెరిగింది. క్వాలిటీలోనూ, క్వాంటిటీలోనూ బాలీవుడ్ చిత్రాలతో తెలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. కాగా అందరినీ మెప్పించిన ఈ పది తెలుగు సినిమాలు చూడాల్సిందే అంటున్నారు విమర్శకులు. అవేంటంటే.. 1. గూడాఛారి: అడవి శేషు హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై […]

ఈ పది తెలుగు సినిమాలు కచ్చితంగా చూడాల్సిందే..
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 02, 2019 | 1:50 PM

మూసకథలంటూ ఒకప్పుడు టాలీవుడ్‌ను చిన్న చూపు చూసిన పలు ఇండస్ట్రీలు ఇప్పుడు మన తెలుగు సినిమా వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముఖ్యంగా బాహుబలి చిత్రం తరువాత టాలీవుడ్ స్థాయి ప్రపంచవ్యాప్తంగా మరింత పెరిగింది. క్వాలిటీలోనూ, క్వాంటిటీలోనూ బాలీవుడ్ చిత్రాలతో తెలుగు సినిమాలు పోటీ పడుతున్నాయి. కాగా అందరినీ మెప్పించిన ఈ పది తెలుగు సినిమాలు చూడాల్సిందే అంటున్నారు విమర్శకులు. అవేంటంటే..

1. గూడాఛారి:

అడవి శేషు హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో నటించడమే కాదు కథను, స్క్రీన్ ప్లేను అందించి కో రైటర్‌గా మంచి మార్కులు కొట్టేశాడు అడవి శేషు. 2.30గంటల పాటు సాగనున్న ఈ థ్రిల్లర్ ఆద్యంతం సస్పెన్స్‌లతో చివరి వరకు ప్రేక్షకులను కూర్చునేలా చేసింది. ఇంకెందుకు ఆలస్యం ఈ సినిమాను చూడాలనుకుంటే వెంటనే అమేజాన్ ప్రైమ్‌కు వెళ్లండి మరి.

2. అ!

కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బా, రెజీనా, ప్రియదర్శి, శ్రీనివాస్ అవసరాల, మురళీ శర్మ, దేవ దర్శిని తదితర తారాగణంతో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం అ!. విభిన్న కథాంశంతో వచ్చిన ఈ చిత్రాన్ని నాని నిర్మించాడు. కమర్షియల్‌గా ఈ చిత్రం విజయాన్ని సాధించనప్పటికీ.. టాలీవుడ్‌లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాలలో అ! స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఈ మూవీకి వైవిధ్యంగా స్క్రీన్ ప్లేను అందించిన ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మంచి పేరును సాధించుకున్నాడు. ఈ సినిమాను చూడాలనుకుంటే వెంటనే నెట్‌ఫ్లిక్స్‌కు లాగిన్ అవ్వండి.

3. రంగస్థలం

మాస్ హీరోగా వెలుగొందుతున్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ చేసిన మొదటి ప్రయోగ చిత్రం రంగస్థలం. అంతేకాదు నటుడిగా రామ్ చరణ్‌కు మంచి పేరు తీసుకొచ్చిన చిత్రం ఇది. 80లలో జరిగిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ రివేంజ్ స్టోరీని తనదైన శైలిలో తెరకెక్కించి.. దర్శకుడిగా మరింత పేరును సంపాదించుకున్నాడు సుకుమార్. ప్రతి విభాగంలోనూ అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రం 2018లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా టాలీవుడ్‌లో నిలిచింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను చూసెయొచ్చు.

4. ఊహలు గుసగుసలాడే

నటుడిగా అందరినీ ఆకట్టుకున్న శ్రీనివాస్ అవసరాల దర్శకుడిగా మారి చేసిన మొదటి ప్రయత్నం ఊహలు గుసగుసలాడే. ఈ సినిమాతో దర్శకుడిగానూ శ్రీనివాస్ అందరినీ మెప్పించాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రంలో నాగ శౌర్య, రాశి ఖన్నా పాత్రలు అందరినీ మెప్పించాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధించింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమాను చూసేయొచ్చు.

5. ఫిదా

తను పుట్టి పెరిగిన పల్లెటూరిని వదిలి ఎక్కడికి వెళ్లకూడదని కోరుకునే ఒక అమ్మాయి హీరోను ఒప్పించి తన కోరికను ఎలా తీర్చుకుంది అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ చిత్రానికి సాయి పల్లవి పెద్ద అస్సెట్ అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. తన భాష, నటన, డ్యాన్స్‌తో ఫుల్ మార్కులు కొట్టేసిన సాయి పల్లవి ఈ మూవీ ద్వారానే టాలీవుడ్‌కు పరిచయం అయింది. కొన్ని పరాజయాల తరువాత శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫుల్ కలెక్షన్లను రాబట్టింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీని చూడొచ్చు.

6. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

టాలీవుడ్ టాప్ హీరోలు వెంకటేశ్, మహేశ్ బాబు మొదటిసారి కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. కొన్ని సంవత్సాల క్రితం టాలీవుడ్‌లో మరుగున పడ్డ మల్టీస్టారర్ చిత్రాలకు ఈ మూవీ మళ్లీ ప్రాణం పోసింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని మెప్పించి.. టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించుకుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని చూసేయొచ్చు.

7. మహానటి

మహానటి సావిత్రి జీవిత అంశాలతో వచ్చిన చిత్రం మహానటి. అంతేకాదు టాలీవుడ్‌లో బయోపిక్‌లకు ఆజ్యం పోసిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా.. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ ఒదిగిపోయిన తీరుకు ఆమెకు బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. తెలుగు, తమిళంలో వచ్చిన ఈ చిత్రం కీర్తి సురేశ్ కెరీర్‌లో చెరగని ముద్రగా నిలిచిపోయింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీని చూసెయొచ్చు.

8. మాయా బజార్

టాలీవుడ్‌లో ఎన్ని చిత్రాలు వచ్చినా అన్నింటిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చిత్రం మాయా బజార్. శశిరేఖా పరిణయం కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావు, సావిత్రి వంటి భారీ తారాగణం నటించారు. నిజానికి చెప్పాలంటే ఎన్ని సార్లు చూసినా విసుగు తెప్పించని చిత్రాలలో ఈ మూవీ కచ్చితంగా ఉంటుంది. అర్థవంతమైన పదాలు, పాటలతో పాటు నటీనటుల అద్భుత నటన ఈ సినిమాను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి. ఈ మూవీని చూడాలనుకునే వారు అమెజాన్ ప్రైమ్‌లో చూడొచ్చు.

9. భలే భలే మగాడివోయ్

ఓ మతిమరుపు హీరో తన లోపాన్ని కప్పిపుచుకోవటానికి చేసే పనులు, తన ప్రేమించే అమ్మాయిని చివరికి ఎలా సాధించుకుండానే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. నాని, లావణ్య త్రిపాఠిలు హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహించాడు. నాని కెరీర్‌ను మార్చేసిన ఈ చిత్రం ఎప్పుడూ చూసినా ప్రేక్షకుల మొహంలో నవ్వులను తెప్పిస్తుంది.

10. సూర్య వర్సెస్ సూర్య

సూర్య కిరణాలు తాకితే హీరో తట్టుకోలేడు.. చనిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకే సూర్యుడి కిరణాలు అతడిపై పడకుండా అతడి అమ్మ పెంచుతుంటుంది. అయితే అనుకోకుండా ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు హీరో. ఆ అమ్మాయికి తన లోపం గురించి తెలీయకుండా ఎలా జాగ్రత్తపడతాడు..?తెలిసిన తరువాత తన ప్రేమను ఎలా ఒప్పించుకుంటాడు..? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. వైవిధ్యంగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించింది.