సింహవాహనంపై విహరించిన శ్రీవారు

కలియుగదైవం వెలిసిన తిరుమలలో ఆ దేవదేవుడి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.. మూడోరోజున సోమవారం ఉదయం మలయప్పస్వామివారు సింహవాహనంపై కొలువుతీరారు.

సింహవాహనంపై విహరించిన శ్రీవారు
Follow us

|

Updated on: Sep 21, 2020 | 11:28 AM

కలియుగదైవం వెలిసిన తిరుమలలో ఆ దేవదేవుడి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.. మూడోరోజున సోమవారం ఉదయం మలయప్పస్వామివారు సింహవాహనంపై కొలువుతీరారు. కళ్యాణోత్సవ మండపంలో ఏకాంతంగా స్వామివారికి సింహవాహనసేవ జరిపించారు. ఒక్కో వాహనంమీద స్వామికి ఒక్కో రకమైన అలంకరణ ఉంటుంది. సింహవాహనాన్ని అధిరోహించిన సమయంలో శ్రీవారు వజ్రఖచితమైన కిరీటీన్ని ధరిస్తారు. జంతువులకు రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీక అని చెబుతారు.. ప్రతి మనిషిలోనూ మానవత్వంతో పాటు ఇటు మృగత్వం, అటు దైవత్వం కూడా ఉంటాయి. మనిషి తనలోని మృగత్వాన్ని జయిస్తే దైవత్వాన్ని అందుకుంటాడు. మానవత్వాన్ని పరిపూర్ణం చేసుకుంటే దేవతలనే మించిపోతాడు. మనిషి తనలోని మృగత్వాన్ని జయించేందుకు స్ఫూర్తిగా .. ఆ ఉన్నతాదర్శాన్ని గుర్తు చేసేందుకే స్వామివారు సింహవాహనం మీద ఊరేగుతారని భక్తులంటారు. ఇక ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల వరకు రంగనాయకుల మండపంలో శాస్త్రోక్తంగా తిరుమంజనం జరుపుతారు. కరోనా వైరస్‌ కారణంగా ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆలయానికే పరిమితం చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.

రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు మలయప్ప స్వామి. మహావిష్ణువు అవతారాలు ఎన్నో! శ్రీవారి అలంకారాలూ ఇంకెన్నో! వాహనవిశేషాలూ మరెన్నో! ఆరాధన విధానాలూ ఎన్నెన్నో! ఆకారాలు ఎన్నయినా , అలంకారాల్లో ఎన్ని వైవిధ్యాలున్నా అందరివాడైన శ్రీనివాసుడు ఒక్కడే! భక్తుల గుండెల్లో ఆయనపట్ల వెల్లివెరిసే భక్తి ఒక్కటే! ఉన్నది ఒక్కడే అయినా ఆయన్ను వివిధ రకాలుగా సేవించుకోవడంలో ఏదో విశేషం ఉంది. దివ్యమైన వినోదం ఉంది. రెండో రోజైన ఆదివారం రాత్రి మలయప్పస్వామివారు హంసవాహనాన్ని అధిరోహించి సర్వ విద్యాప్రదాయని అయిన సరస్వతీదేవి రూపంలో కటాక్షించారు. ఆ సమయంలో స్వామివారిని విద్యాలక్ష్మీ రూపంలో ఆరాధిస్తారు. చేతిలో కచ్చపి వీణ ధరించిన స్వామివారికి విశేష దివ్యాభవరణాలతో, పట్టు పీతాంబరాలతో అలంకరించారు. గుణ, అవగుణ విచక్షణా జ్ఞానానికి సంకేతం హంస. ఆ వాహనంపై కొలువుదీరిన స్వామివారు నయనానందకరంగా కనిపించారు.