జియోతో జతకడుతున్న టిక్ టాక్..?

అమెరికాలో నిషేధానికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ తాజాగా భారత వ్యాపారాలపై దృష్టి సారించింది. భారత్‌లో తన షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్‌‌ వ్యాపారాన్ని రిలయన్స్ జియోతో జత కట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. . భారత్ సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో కీలక సమాచారం తస్కరించే అవకాశం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం భారత్ లో టిక్ టాక్ సహా మరికొన్ని యాప్స్ నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మిగతా యాప్ ల […]

జియోతో జతకడుతున్న టిక్ టాక్..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 13, 2020 | 4:06 PM

అమెరికాలో నిషేధానికి గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ తాజాగా భారత వ్యాపారాలపై దృష్టి సారించింది. భారత్‌లో తన షార్ట్ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్‌‌ వ్యాపారాన్ని రిలయన్స్ జియోతో జత కట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. .

భారత్ సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో కీలక సమాచారం తస్కరించే అవకాశం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం భారత్ లో టిక్ టాక్ సహా మరికొన్ని యాప్స్ నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మిగతా యాప్ ల విషయం ఎలా ఉన్నప్పటికీ.. ప్రజాదరణ ఉన్న టిక్ టాక్ కి మాత్రం కష్టాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలే అమెరికా ప్రభుత్వం కూడా తన దేశంలో టిక్ టాక్ నిషేధిస్తూ ఏకంగా బిల్లును పాస్ చేసింది. అమెరికాలో తమ కార్యకలాపాలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలోనే బైట్‌డ్యాన్స్ ఈ నిర్ణయం తీసుకుందని కంపెనీ అంతర్గత వర్గాలు చెప్పినట్టు టెక్ క్రంచ్ వెల్లడించింది. గత నెలాఖరులోనే ఇరు కంపెనీలు చర్చలు ప్రారంభించాయని త్వరలోనే ఒప్పందంపై తుదినిర్ణయం తీసుకోవల్సి ఉందని పేర్కొంది. అయితే దీనిపై బైట్‌డ్యాన్స్, రిలయన్స్ జియో ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. భారత్ లో ప్రజాదరణ ఎక్కువగా ఉన్న టిక్‌టాక్ వ్యాపారం 3 బిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని అంచనా.

దేశంలో టిక్‌టాక్‌పై నిషేధం విధించడం, భవిష్యత్తు కార్యకలాపాలపై సందిగ్ధత నెలకొనడంతో కంపెనీ ఉద్యోగులు వేరే అవకాశాలపై దృష్టిపెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టిక్‌టాక్-జియో ఒప్పందంపై ఊహాగానాలు వస్తుండడం ఉద్యోగుల్లో కొంత ఊరటనిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో 2 వేలకు పైగా ఉద్యోగులు టిక్‌టాక్‌లో పనిచేస్తుండగా.. ఇప్పుడు కొత్తగా ఉద్యోగాల్లోకి ఎవరినీ తీసుకోవడం లేదు.

దేశ భద్రత దృష్ట్యా యాప్‌ను నిషేధించిన మరుసటి రోజు టిక్‌టాక్ సీఈవో కెవిన్ మేయర్ స్పందిస్తూ.. ‘‘ఉద్యోగులే మా కంపెనీకి అతిపెద్ద బలం. వారి క్షేమానికే అధిక ప్రాధాన్యం ఇస్తాం…’’ అని పేర్కొన్నారు. అయితే తాజాగా అమెరికాలో సైతం టిక్‌టాక్‌ ను బ్యాన్ చేయడంతో ఉద్యోగుల్లో ఆశలు అడుగంటాయి. అటు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో టిక్‌టాక్ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్టు ఇటీవల మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఇటు భారత్ లో అగ్రగామి దిగ్గజం రిలయన్స్ తో టిక్ టాక్ జత కడితే మళ్లీ గాడిలో పడవచ్చని ఉద్యోగులు భావిస్తున్నారు.