నివార్ తుఫాన్ తమిళనాడులో బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. అదేవిధంగా తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని పలు చోట్ల ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకెళితే.. చెన్నైలోని రోయపెట్ట ప్రాంతంలో ఓ వ్యక్తి(50) బీసెంట్ రోడ్డు దాటుతుండగా ఈదురు గాలుల ధాటికి రోడ్డు పక్కనే ఉన్న చెట్టు కుప్పకూలి అతనిపై పడింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గనమించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రాణాలు వదిలాడు. అయితే ఈ ఘటన సమీపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇదిలాఉండగా, బిహార్‌కు చెందిన వలస కార్మికులు శబజ్(27) కోయంబేడులోని ఓ భవంతిలో నివాసముంటున్నాడు. వర్షం కారణంగా బిల్డింగ్ టెర్రస్‌పై నీరు చేరడంతో వాటిని తొలగించడానికి టెర్రస్‌పైకి వెళ్లాడు. ఈ సమయంలో ఒక్కసారిగా పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం కూలిపోవడంతో విద్యుత్ వైర్ తెగి నీటిలో పడింది. దీంతో అతను విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక తంబరం ప్రాంతానికి చెందిన కౌసల్య(33) కూడా విద్యుదఘాతానికి గురై ప్రాణాలు విడిచింది. విద్యుత్ వైర్ తెగి నేరుగా ఆమెపై పడటంతో కౌసల్య అక్కడికక్కడే చనిపోయింది.
CCTV footage of a tree falling over a man walking by. #CycloneNivar pic.twitter.com/3BB76UT7KH
— Pramod Madhav♠️ (@PramodMadhav6) November 26, 2020
ఈ ఘటనలతో వెంటనే అప్రమత్తమైన విద్యుత్ శాఖ అధికారులు చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 101 ఇళ్లు ధ్వంసమైనట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. 26 మూగ జీవాలు ప్రాణాలు కోల్పోయాయని ప్రకటించింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 380 చెట్లు కుప్పకూలినట్లు ప్రకనటలో పేర్కొంది. కాగా, నివార్ తుఫాన్ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 3,085 రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేసింది. ఈ క్యాంపులలో ప్రస్తుతం 2,27,300 ఉన్నారని ప్రభుత్వం తెలిపింది.