ఒక రాష్ట్రం – మూడు రాజధానులు..ఏపీ కాదు మరెక్కడ?

ఒక రాష్ట్రం – మూడు రాజధానులు. ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క నగరం రాజధానిగా అన్న ఆలోచన ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ఇలా మరెక్కడైనా ఉందా అంటే వెంటనే దక్షిణాఫ్రికా మదిలో మెదులుతుంది. ఇది కాక ప్రత్యేక భౌగోళిక, వాతావరణ, రాజకీయ పరిస్థితుల రీత్యా ఒక రాష్ట్రానికి రెండు రాజధానులు, రెండు రాష్ట్రాలకు ఒకే రాజధాని వంటి విచిత్రాలు మన దేశంలోనే ఉన్నాయి. జమ్ము-కాశ్మీర్‌ రాష్ట్రానికి శ్రీనగర్, జమ్ము నగరాలు రాజధాలుగా ఉండగా, […]

ఒక రాష్ట్రం – మూడు రాజధానులు..ఏపీ కాదు మరెక్కడ?
Follow us

| Edited By: Team Veegam

Updated on: Jan 16, 2020 | 2:26 PM

ఒక రాష్ట్రం – మూడు రాజధానులు. ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్క నగరం రాజధానిగా అన్న ఆలోచన ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ఇలా మరెక్కడైనా ఉందా అంటే వెంటనే దక్షిణాఫ్రికా మదిలో మెదులుతుంది. ఇది కాక ప్రత్యేక భౌగోళిక, వాతావరణ, రాజకీయ పరిస్థితుల రీత్యా ఒక రాష్ట్రానికి రెండు రాజధానులు, రెండు రాష్ట్రాలకు ఒకే రాజధాని వంటి విచిత్రాలు మన దేశంలోనే ఉన్నాయి. జమ్ము-కాశ్మీర్‌ రాష్ట్రానికి శ్రీనగర్, జమ్ము నగరాలు రాజధాలుగా ఉండగా, హరియాణా, పంజాబ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఒకే నగరం చండీగఢ్ రాజధానిగా ఉంది. మన దేశానికి స్వాతంత్ర్య రాకముందు బ్రిటీష్ పాలనలో సిమ్లా వేసవి రాజధానిగా కొనసాగింది.

వర్తమానంలోకి వస్తే.. ఒక రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రస్తావన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశంలో మరో రాష్ట్రంలోనూ ఉంది. ఇంకా చెప్పాలంటే ఇది అక్కడ కొత్తగా తలెత్తిన సమస్య కాదు. ఆ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా మూడు ముక్కలాటలా రాజధానుల దోబూచులాట జరుగుతోంది. ఆ రాష్ట్రం మరేదో కాదు – హిమగిరుల్లో కొలువుదీరిన ఉత్తరాఖండ్.

రాజధానులు మూడు – డెహ్రాడూన్, నైనితాల్, గైర్సైన్

ఈ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు పేరు ఉత్తరాంచల్. దాదాపు ఆరేళ్ల తర్వాత ఉత్తరాఖండ్‌గా మారింది. రాష్ట్రం పేరే కాదు, రాజధాని విషయంలోనూ ఈ మార్పు తప్పలేదు. రాష్ట్రానికి అన్ని హంగులతో కొత్త రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలికంగా ఎక్కణ్ణుంచి పాలన సాగించాలన్న విషయంపై తర్జన భర్జన జరిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పశ్చిమ ప్రాంతాన్ని ‘గఢ్వాల్’ అని, తూర్పు ప్రాంతాన్ని ‘కుమావూ’ అని పిలుస్తారు. భౌగోళికంగా అత్యధిక ప్రాంతం అంటే, ఉత్తరాన మొత్తం హిమాలయాలే. దక్షిణ భాగాన కొంత మైదాన ప్రాంతం ఉంది. డెహ్రాడూన్, హరిద్వార్, రుషికేష్, కాశీపూర్, రూర్కీ, హల్ద్వానీ, రుద్రాపూర్ వంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న మైదాన ప్రాంత పట్టణాలున్నాయి. వీటిలో డెహ్రాడూన్‌కి రోడ్డు, రైలు మార్గాలతో కనెక్టివిటీ ఉండడం, అన్ని వసతులు కలిగి ఉండడంతో తాత్కాలిక రాజధానిగా నిర్ణయించారు. అలాగే పర్వత ప్రాంతంలోని నైనితాల్ పట్టణంలో హైకోర్టును ఏర్పాటు చేసి జ్యుడీషియల్ క్యాపిటల్‌గా చేశారు. రాజ్‌భవన్ కూడా అక్కడే ఉంది.

రాష్ట్రం ఏర్పడక ముందే రాజధాని ఖరారు

ఇలా రెండు తాత్కాలిక రాజధానులతో ఏర్పాటైన ఉత్తరాఖండ్ రాష్ట్రానికి శాశ్వత రాజధాని అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ప్రాంతంలో నిర్మించాలని నిర్ణయించారు. నిజానికి రాష్ట్రం ఏర్పడక ముందే రాజధాని ఈ రాష్ట్రానికి శాశ్వత రాజధాని ఖరారైంది. అదే గైర్సైన్. రాష్ట్రవాసులకు తప్ప బయటివాళ్లకు ఈ ఊరి పేరు పెద్దగా తెలియదు. కానీ రెండు దశాబ్దాల చరిత్ర కల్గిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గైర్సైన్‌కి మాత్రం 6 దశాబ్దాల చరిత్ర ఉంది. తూర్పు ప్రాంతం ‘కుమావూ’, పశ్చిమ ప్రాంతం ‘గఢ్వాల్’ను కలిపే లోయలో ఉన్న ఓ కుగ్రాగమే గైర్సైన్. ఈ ప్రాంతాన్ని రాష్ట్రానికి రాజధానిగా చేయాలని 1960లోనే వీర్ చంద్ర సింగ్ గఢ్వాల్ ప్రతిపాదించారు. ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ వ్యవస్థాపకుడు బిపిన్ చంద్ర త్రిపాఠీ సహా పలువురు ఉత్తరాఖండ్ రాష్ట్ర ఉద్యమకారులు ఈ ప్రాంతాన్నే రాజధానిగా తీర్మానించారు. ఈ ప్రాంతాన్ని రాజధానిగా డిక్లేర్ చేయాలంటూ 1994లో 157 రోజుల పాటు నిరాహార దీక్షలు జరిగాయి. గైర్సైన్ రాజధాని ఆందోళన్ సమితి పేరిట ప్రజా ఉద్యమాలు నడిచాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదొక ప్రజాందోళనగా మారింది.

రాజధానిపై దీక్షిత్ కమిషన్

రాజధానిపై జరుగుతున్న ప్రజాందోళన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ వి. దీక్షిత్ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ రాష్ట్రంలోని 5 పట్టణాలను రాజధాని కోసం పరిశీలించింది. అవి డెహ్రాడూన్, కాశీపూర్, రామ్‌నగర్, రిషికేష్ మరియు గైర్సైన్. విస్తృత స్థాయిలో అన్ని కోణాల్లో అధ్యయనం చేసిన కమిషన్ డెహ్రాడూన్, కాశీపూర్ పట్టణాలు రాజధానికి అనువైనవని తేల్చింది. 2008 ఆగస్టు 17న ఉత్తరాఖండ్ అసెంబ్లీకి సమర్పించిన తన నివేదికలో తాత్కాలిక రాజధానిగా ఉన్న డెహ్రాడూన్ పట్టణాన్నే శాశ్వత రాజధానిగా చేయాలని సిఫార్సు చేసింది. భౌగోళిక, క్లిష్ట వాతావరణ పరిస్థితులను ఇందుకు కారణాలుగా చూపింది. డెహ్రాడూన్ పట్టణానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు, విమాన మార్గాలలో రవాణా సదుపాయం కలిగి ఉండడంతో పాటు భూకంపాల ముప్పు, కొండ చరియలు విరిగిపడే అవకాశాలు తక్కువగా ఉన్న ప్రాంతమని, క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు లేకుండా అన్ని కాలాల్లోనూ నగరానికి చేరుకోడానికి అవకాశాలుంటాయని విశ్లేషించింది. గైర్సైన్ ప్రాంతం ఇందుకు పూర్తి భిన్నంగా ఉందని, సీస్మిక్ డాటా ప్రకారం అత్యంత ప్రమాదకరమైన భూకంపాల జోన్-5లో ఉందని తెలిపింది. శీతాకాలంలో మంచు కారణంగా, వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడడం వల్ల రవాణా వ్యవస్థ స్తంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కమిషన్ తన 80 పేజీల నివేదికలో పేర్కొంది. దీంతో గైర్సైన్ ఆశలపై దీక్షిత్ కమిషన్ నీళ్లు చల్లినట్టయింది.

కిం కర్తవ్యం?

నిజానికి మెట్రో నగరంగా అన్ని హంగులతో అభివృద్ధి చెందుతున్న డెహ్రాడూన్ పట్టణాన్ని విడిచి వెళ్లడం పాలకులకు, ప్రభుత్వాధికారులకు ఇష్టం లేదు. వారి ఇష్టాయిష్టాలకు తగ్గట్టే దీక్షిత్ కమిషన్ నివేదిక వచ్చింది. అయితే గైర్సైన్‌ను శాశ్వత రాజధాని చేయాలన్న ప్రజల సెంటిమెంట్‌ దెబ్బతినకుండా మధ్యే మార్గంగా గైర్సైన్‌ను భవిష్యత్తు రాజధానిగా తీర్చిదిద్దుతామని పాలకులు చెబుతూ వస్తున్నారు. ఆ క్రమంలో 2012లో నాటి ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ గైర్సైన్‌లో తొలిసారిగా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. అక్కడ సరికొత్త విధానసభ భవన నిర్మాణం కోసం 2013 లో శంఖుస్థాపన చేసి, 2014లో నిర్మాణం పూర్తిచేశారు. అదే ఏడాది ‘గైర్సైన్ డెవలప్‌మెంట్ కౌన్సిల్’ ఏర్పాటు చేశారు. 2016 నవంబర్ 17, 18 తేదీల్లో రెండు రోజుల పాటు కొత్త విధానసభ భవనంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. 2017లో మరోసారి కేబినెట్ సమావేశం నిర్వహించి 465.5 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో నివాస భవనాలతో పాటు కమర్షియల్ కాంప్లెక్సులు, పాఠశాలలు, ఆసుపత్రులు – డిస్పెన్సరీలు, ఆట స్థలాలు, పార్కులు ఉండేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం పట్టుమని 10వేల మంది జనాభా కూడా లేని ఈ ప్రాంతంలో భవిష్యత్తులో పెరగబోయే జనాభాను, జన సాంద్రతను దృష్టిలో పెట్టుకుని ఒక సరస్సు నిర్మాణం చేపట్టాలని ప్రస్తుత ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఆదేశాలు జారీ చేశారు. విమానమార్గంలో కనెక్టివిటీ కోసం ఒక ఎయిర్‌స్ట్రిప్ నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇలా మొత్తానికి భవిష్యత్తు రాజధాని మెల్ల మెల్లగా రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతానికి వేసవి రాజధానిగా ప్రతియేటా బడ్జెట్ సమావేశాలు ఇక్కడే నిర్వహిస్తామని చెప్పినప్పటికీ, గుర్తొచ్చినప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా కేబినెట్ లేదా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాత్కాలిక రాజధాని అనుకున్న డెహ్రాడూన్ మాత్రం శాశ్వత హోదాను సంతరించుకుని శరవేగంగా విస్తరిస్తూ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.

ప్రజాభీష్టం – పాలకులకు కష్టం

మైదాన ప్రాంత ప్రజలు మినహా పర్వత ప్రాంత ప్రజలంతా తమకు గైర్సైన్ ప్రాంతమే రాజధానిగా ఉండాలని బలంగా కోరుకుంటున్నారు. పాలకులకు ఇష్టం లేక సాకులు వెతుకుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. నిజానికి గైర్సైన్‌ ప్రాంతం అందరికీ అందుబాటులో ఆమోదయోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియల్, లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటూ వేర్వేరుగా కాకుండా, వేసవి – శీతాకాలం అంటూ వేరు చేయకుండా గైర్సైన్‌ను శాశ్వత రాజధానిగా అభివృద్ధి చేయాలని, పాలన అక్కణ్ణుంచే సాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం హైకోర్ట్ కొలువైన నైనితాల్ హిల్ స్టేషన్ కావడంతో వచ్చినవారు తమ వాహనాలను సైతం పార్క్ చేసుకోలేని ఇబ్బందికర పరిస్థితి అక్కడుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నైనితాల్‌లో పేరుకు రాజ్‌భవన్ ఉన్నప్పటికీ గవర్నర్ మాత్రం ఏడాదిలో 11 నెలలు డెహ్రాడూన్‌లోనే ఉంటారని, వేసవిలో ఒక నెల రోజులు మాత్రం నైనితాల్‌లో గడుపుతారని చెబుతున్నారు. పాలకులు, అధికారులు తమ సౌలభ్యం చూసుకుంటున్నారు తప్ప ప్రజల ఇబ్బందులను, సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు పాలన పూర్తిగా గైర్సైన్‌కి మారితే వసతులు కూడా వేగంగా సమకూరుతాయని, లేదంటే అది ఎప్పటికీ ‘భవిష్యత్తు’ రాజధానిగానే మిగిలిపోతుందని ఆవేదన చెందుతున్నారు.

– మహాత్మ కొడియార్ టీవీ9 సీనియర్ జర్నలిస్టు

కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..