ఆస్సాం ఎన్నార్సీ… పేదోళ్లకేదీ దారి ? కోర్టు ఫీజులు చెల్లించే స్తోమత ఏదీ ?

అస్సాంలో ఇటీవల నిర్వహించిన ఎన్నార్సీ అనేక లక్షల మంది పేదల పొట్ట కొడుతోంది. దాదాపు 19 లక్షల మంది పేర్లను తాజా జాబితాలో తొలగించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నివసించడానికి వీరు అనర్హులని, అయితే వీరు ట్రిబ్యునల్స్ ని గానీ, కోర్టులను గానీ ఆశ్రయించవచ్చునని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ తతంగం వెనుక ఎన్నో ‘ కన్నీటి కథలు ‘ దాగున్నాయి. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. అది 2010 సంవత్సరం.. జులై నెల. అస్సాం నేషనల్ రిజిస్టర్ […]

ఆస్సాం ఎన్నార్సీ... పేదోళ్లకేదీ దారి ? కోర్టు ఫీజులు చెల్లించే స్తోమత ఏదీ ?
Follow us

|

Updated on: Sep 04, 2019 | 1:38 PM

అస్సాంలో ఇటీవల నిర్వహించిన ఎన్నార్సీ అనేక లక్షల మంది పేదల పొట్ట కొడుతోంది. దాదాపు 19 లక్షల మంది పేర్లను తాజా జాబితాలో తొలగించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నివసించడానికి వీరు అనర్హులని, అయితే వీరు ట్రిబ్యునల్స్ ని గానీ, కోర్టులను గానీ ఆశ్రయించవచ్చునని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ తతంగం వెనుక ఎన్నో ‘ కన్నీటి కథలు ‘ దాగున్నాయి. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. అది 2010 సంవత్సరం.. జులై నెల. అస్సాం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ) ని అప్ డేట్ చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రదర్శనలు జరిగాయి. హింసాత్మకంగా జరిగిన ఆందోళనలను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు.

వారిలో అలీ అనే యువకుడు కూడా ఉన్నాడు. అప్పట్లో కాంగ్రెస్ ఎంపీ అయిన హిమంత బిశ్వ శర్మ.. అతని కుటుంబాన్ని పరామర్శించి.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చూస్తుండగానే తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. ఆయన ఇచ్చిన హామీకి అతీగతీ లేదు. ఈ ఏడాది ఆగస్టు 20 న ఎన్నార్సీ తుది జాబితా ప్రచురించారు. 19 లక్షల మందిని ‘ వీధుల్లో పడేశారు ‘. నాడు కాంగ్రెస్ నేత అయిన శర్మ.. పార్టీలు మారి.. బీజేపీలో చేరిపోయారు. రాష్ట్ర ఆర్ధిక మంత్రి కూడా అయ్యారు. అయితే ఈ తాజా జాబితాలో అనేకమంది బెంగాలీ హిందువుల పేర్లను వదిలేశారని గగ్గోలు పెడుతున్నారు. ఎన్నార్సీని రీ-వెరిఫికేషన్ జరిపించాలని ఆయనే డిమాండ్ చేస్తున్నాడు. అలీ కుటుంబం వంటి ఎన్నో పేద కుటుంబాల సంగతిని ఆయన మర్చిపోయారు.

తాజా జాబితాలో తమ పేర్లు లేనివారు 120 రోజుల్లోగా ట్రిబ్యునల్స్ లేదా కోర్టులను ఆశ్రయించవచ్ఛునని కేంద్రం చెబుతోంది. కానీ పౌరసత్వం కోల్పోయిన వారిలో సరైన కొంపా, గూడూ లేనివారున్నారు. కోర్టుకెక్కాలంటే లాయర్లకు పెద్దఎత్తున ఫీజు చెల్లించుకోవాలి. తమకున్న భూములనో, చిన్నా చితకా ఆస్తులను అమ్ముకునో, కుదువ పెట్టుకునో ఈ ఫీజు చెల్లించాల్సి వస్తుంది. అవి కూడా లేనివారి గతి ఏమిటన్నదే ప్రశ్న.. కనీసం తమ తమ స్వస్థలాలకు కూడా వెళ్లలేని పరిస్థితి వారిది. ఢిల్లీకి చెందిన ఓ స్వచ్చంద సంస్థ డైరెక్టర్ సుహాస్ చక్మ.. ఎన్నార్సీ ప్రచురణకు ముందే అసోం లోని గోల్పారా, కామరూప్ వంటి జిల్లాలను విజిట్ చేసి.. ఒక్కో కుటుంబం కేవలం ఎన్నార్సీ విచారణలకోసమే లాయర్లకు 19 వేల రూపాయలను ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇప్పుడు ఈ మొత్తం రెట్టింపు అయిఉంటుందన్నది ఆయన అభిప్రాయం. ఈ పేదల్లో అనేకమంది నిరక్షరాస్యులు కూడా ఉన్నారు. భారీ ఫీజులు కట్టి.. న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని వీరు ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నారు. ఈ 19 లక్షల మందిలో ఎంతమందికి న్యాయం లభిస్తుందన్నది ప్రశ్న..