అమిత్ షా మమ్మల్ని చంపాలని చూస్తున్నారు..: ఫరూక్ అబ్దుల్లా

రాజ్యసభలో ఆమోదం పొందిన జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లు పై లోక్‌సభలో వాడీవేడీగా చర్చ జరుగుతోంది. కశ్మీర్ విభజనకు సంబంధించిన రెండు బిల్లులను లోక్‌సభలోప్రవేశపెట్టారు అమిత్ షా. జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 యాక్టును రద్దు చేస్తూ ఒక బిల్లు, జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ 2019 బిల్లును ఆయన సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఇప్పటికే రాజ్యసభ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గెజిట్ కూడా విడుదల చేశారు. ఇదిలా వుండగా శ్రీనగర్‌‌లో ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వూలో మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. తమని చంపడానికి అమిత్ షా కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. తనను హౌస్ అరెస్ట్ చేయలేదని అమిత్ షా లోక్‌సభలో అబద్దాలు చెప్పారని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. తనని గృహ నిర్భందం చేసిన మాట నిజమేనని.. తనని కలిసేందుకు ఎవరిని అనుమతించడం లేదని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. తన కుమారుడు ఒమర్ అబ్దుల్లాను జైల్లో పెట్టారని.. మోదీ నియంతలా మారారని ఆయన విమర్శించారు.

కాగా, ఆర్టికల్ 370 రద్దుపై కోర్టును ఆశ్రయిస్తామని మజ్లీస్ ఎంపీ ఓవైసీ కూడా అన్నారు. దేశంలో ఫెడరలిజానికి అర్థం లేకుండా పోయిందని ఆయన ఆరోపించారు. భారత్ కూడా చైనాలాగా మారుతోందని అన్నారు. నాజీల లాగా దేశంలో పాలన సాగుతోందని.. నాజీ సిద్ధాంతాలను బీజేపీ అనుసరిస్తోందని ఎంపీ ఓవైసీ విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *