పంతం నెగ్గించుకున్న రైతులు.. ఢిల్లీలో ధర్నాకు అనుమతిచ్చిన కేంద్ర ప్రభుత్వం..

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగిన రైతులు తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. రైతుల ఆందోళనకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం..

  • Shiva Prajapati
  • Publish Date - 3:31 pm, Fri, 27 November 20
పంతం నెగ్గించుకున్న రైతులు.. ఢిల్లీలో ధర్నాకు అనుమతిచ్చిన కేంద్ర ప్రభుత్వం..

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగిన రైతులు తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. రైతుల ఆందోళనకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం.. ఢిల్లీలో ధర్నా చేపట్టేందుకు రైతులకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ప్రకటన విడుదల చేసింది. బురారీ ప్రాంతంలోని నిరంకారీ సమాగం గ్రౌండ్స్‌లో నిరసన కార్యక్రమం చేపట్టొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గురువారం ‘ఛలో ఢిల్లీ’ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దానిలో భాగంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది రైతులు దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలు గురుగ్రామ్, ఫరీదాబాద్‌లోని సరిహద్దుల్లో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. బారీకేడ్లను ఏర్పాటు చేసి రైతులను అడ్డగించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని రైతులు ఢిల్లీకి చేరుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులతో తలపడ్డారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. లాఠీ చార్జి కూడా చేశారు. రైతులు ఎమాత్రం తగ్గకపోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రైతులు ఢిల్లీలోని నిరంకారీ గ్రౌండ్స్‌లో ధర్నా చేసుకోవచ్చంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు.