2024లో అధికారంలోకి వచ్చేది బీజేపీనే : అమిత్ షా

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన పార్టీ నిర్మాణంపై దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి తెలంగాణలో 19 శాతం ఓట్లు వచ్చాయంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో మొత్తం 18 లక్షల మందిని సభ్యులుగా చేర్చాలని రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేశారు. పార్టీని బలోపేతం చేయడంలో రాష్ట్ర కార్యవర్గం విఫలం అయినట్టు భావిస్తే .. తానే స్వయంగా రంగంలోకి దిగుతానని తెలంగాణ జిల్లాలన్నిటిలో పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానన్నారు అమిత్‌షా.

ప్రతి బూత్‌లోనూ కార్యకర్తల్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు . సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంగా సాగుతున్న పార్టీని కిందిస్థాయి వరకు తీసుకెళ్లాలన్నారు. ఇప్పటికే దేశంలో 17 రాష్ట్రాల్లో బీజేపీకి 50 శాతం ఓట్లు వచ్చాయని, తెలంగాణలో 50 శాతం వచ్చేవరకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఇంటిపై బీజేపీ జెండా ఎగరేయాలన్నారు అమిత్ షా. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శంషాబాద్‌లో ఓ ప్రైవేటు హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *