యాదాద్రిలో ఉద్రిక్తత, బీజేపీ శ్రేణులపై లాఠీ ఛార్జ్‌

Tension Yadadri for kcr photos in pillar, యాదాద్రిలో ఉద్రిక్తత, బీజేపీ శ్రేణులపై లాఠీ ఛార్జ్‌

యాదాద్రి జిల్లా యాదగిరి గుట్టలో ఉద్రిక్తత నెలకొంది. యాదాద్రి ఆలయ పిల్లర్లపై ఏర్పాటు చేసిన బొమ్మలు వివాదాలకు దారితీస్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ తో సహా ఎమ్మెల్యే రాజాసింగ్, కొందరు బీజేపీ నేతలు, బీజేపీ శ్రేణులు రాయగిరి నుండి యాదాద్రి వరకు ర్యాలీగా చేరుకొని కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు లక్ష్మణ్, రాజాసింగ్ తో పాటు కొందరు నేతలను మాత్రమే కొండమీదకి అనుమతిస్తామన్నారు. అందరినీ అనుమతించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బీజేపీ శ్రేణులపై లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. పలువురు ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అక్కడ్నుంచి తరలించారు.
యాదాద్రి ప్రధానాలయం రాతిస్తంభాలపై చెక్కిన రాజకీయ చిత్రాలు, బొమ్మలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పలు రాజకీయ పార్టీలు, ధార్మిక సంస్థలు ఆందోళన నిర్వహించాయి. దక్షిణ దిశలోని స్తూపాలపై సీఎం కేసీఆర్‌ బొమ్మ, కారు గుర్తు, కేసీఆర్‌ కిట్‌, మహాత్మగాంధీ, మాజీ
ప్రధానులు ఇందిరగాంధీ, రాజీవ్‌గాంధీ, పీర్ల పంజా, పంచకల్యాణి, చార్మినార్‌ బొమ్మలను చెక్కారని హిందూ సంస్థలు ఆరోపించాయి. ఈ మేరకు శుక్రవారం యాదాద్రీ వెళ్లిన రాజకీయ,హిందూ సంస్థల నేతలు ఆలయ మండప ప్రాకారాలను పరిశీలించారు. వెంటనే వాటిని తొలగించాలని రాజగోపురం ఎదుట నిరసన చేపట్టారు. వీటిని మూడు రోజుల్లోగా తొలగించాలంటూ డిమాండ్‌ చేశారు. మండప ప్రాకారాల్లో భక్తితత్వాన్ని పెంపొందించే దిశలో కాకుండా ఇతర మత చిహ్నాలను, రాజకీయ నేతల బొమ్మలు చెక్కడం విడ్డూరమని ఆరోపించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఆలయ పరిసరాల్లోకి ఎవ్వరినీ అనుమతించేది లేదని ఆంక్షలు విధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *