ఆదివాసీలు దేశద్రోహులా ? ఇదెక్కడి ప్రజాస్వామ్యం ?

ఝార్ఖండ్ లోని ఆదివాసీలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఝార్ఖండ్ అసెంబ్లీకి ఈ నెల 30 నుంచి మొదలై ఐదు దశల్లో జరగనున్న ఎన్నికలను బహిష్కరించాలా అన్న యోచనలో వీరు ఉన్నారు. ముఖ్యంగా ఖుంతి జిల్లాలోని సుమారు 10 వేల మంది ఆదివాసీలపై దేశద్రోహం కేసులు నమోదవడమే ఇందుకు కారణం. తమ భూములను బడా కంపెనీలకు ధారాదత్తం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వీరిపై పోలీసులు ఈ కేసులను నమోదు చేయడం భారత ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తోందని సామాజిక […]

ఆదివాసీలు దేశద్రోహులా ? ఇదెక్కడి ప్రజాస్వామ్యం ?
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 21, 2019 | 1:14 PM

ఝార్ఖండ్ లోని ఆదివాసీలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఝార్ఖండ్ అసెంబ్లీకి ఈ నెల 30 నుంచి మొదలై ఐదు దశల్లో జరగనున్న ఎన్నికలను బహిష్కరించాలా అన్న యోచనలో వీరు ఉన్నారు. ముఖ్యంగా ఖుంతి జిల్లాలోని సుమారు 10 వేల మంది ఆదివాసీలపై దేశద్రోహం కేసులు నమోదవడమే ఇందుకు కారణం. తమ భూములను బడా కంపెనీలకు ధారాదత్తం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వీరిపై పోలీసులు ఈ కేసులను నమోదు చేయడం భారత ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తోందని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జిల్లాలోని చుక్రు గ్రామంలో వీరికి చెందిన భూమిని కొత్త రాజధాని ‘ గ్రేటర్ రాంచీ ‘ నిర్మాణానికి కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే చాందీహ్, బంద్రావంటి వివిధ గ్రామాలవాసులు కూడా ఆందోళనలో ఉన్నారు. తమ భూముల ఆక్రమణకు అధికారులు గానీ, పోలీసులు గానీ వచ్చిన పక్షంలో.. వారిని అడ్డగించేందుకు ‘ పత్థల్ గడి ‘ (రాళ్లను అడ్డుపెట్టి ) నిరసనకు పూనుకోవాలన్నది ఈ ఆదివాసీల యోచన. దీన్నే ‘ పత్థల్ గడి ఉద్యమం ‘ అని కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ఉద్యమంలో పాల్గొనకుండా చూసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఆదివాసీల్లో 70 ఏళ్ళకు పైబడిన వృధ్ధులు కూడా ఉన్నారు. వీరిలో కొంతమందికి ఈ కేసులు ఎందుకు పెడుతున్నారో కూడా తెలియని పరిస్థితి ! భారత రాజ్యాంగం లోని ఐదో షెడ్యూల్ కింద ఆదివాసీలకు ప్రత్యేక ప్రతిపత్తి సౌకర్యం ఉన్నప్పటికీ.. ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోవడంలేదు. ఝార్ఖండ్ రాజధాని రాంచీకి అతి దగ్గరగా ఉంది ఖుంతి గ్రామం. తమ భూములకు సంబంధించి తమకు గల హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఈ గిరిజనులు ఆరోపిస్తున్నారు. జర్నలిస్టు, రైటర్, సామాజికవేత్త కూడా అయిన దయామణి బార్లా అనే గిరిజన మహిళ .. ఆదివాసీల హక్కులకోసం ఏనాటినుంచో పోరాడుతోంది. 2012 లో ఈమెను పోలీసులు అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో ఖుంతి జిల్లా నుంచి ‘ ఆప్ ‘ పార్టీపై పోటీ చేసి దయామణి ఓడిపోయింది. అయితే ఈ సారి అసెంబ్లీ ఎన్నికలబరిలో నిలుస్తోంది.

కాగా-10 వేలమందికిపైగా ఆదివాసీలపై దేశద్రోహం కేసులు నమోదు చేయడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన ట్విటర్ లో దుయ్యబట్టారు. ఒకే జిల్లాలో ఇంతమందిపై ఈ కేసులు నమోదు చేస్తారా ? ఇది నిరంకుశ చర్య అని ఆయన ఆరోపించారు. తమ భూములపై తమకు గల హక్కులకోసం పోరాడుతున్న వీరు అసలు దేశద్రోహులెలా అవుతారని ఆయన ప్రశ్నించారు. అయితే ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అమాయకులైన ఈ గిరిజనులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తారా అన్న వార్తలు కూడా వస్తున్నాయి.