తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం

తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం బోనాల పండుగ సంబురం

తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం
Follow us

|

Updated on: Jun 25, 2020 | 3:28 PM

తెలంగాణ సంస్కృతికి నిలువుటద్దం బోనాల పండుగ సంబురం

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు. తెలంగాణ పండుగ సంబరమవుతుంది. హుషారెత్తించే పాటవుతుంది. డప్పుల చప్పుడవుతుంది. పోతరాజు నృత్యమవుతుంది. భక్తి పారవశ్యమవుతుంది. స్ర్తీ మూర్తుల చెంపలకు పసుపు అద్దుకుంటుంది. నుదుటన కుంకుమ బొట్టవుతుంది. ఆడపడచుల నెత్తిన బోనం కిరీటమవుతుంది. ఇంట్లో సందడి సంతరించుకుంటుంది. వేపాకు తోరణమవుతుంది. అమ్మవారు అనుగ్రహిస్తుంది. మొత్తంగా ఇదో సంస్కృతిక సంబరం. విస్తరణలో భాగంగా ఛిద్రమైపోతున్న నగరానికి ఇదో ఆత్మీయ ఆలింగనం. అక్కున చేర్చుకునే ఊరడింపు. కాంక్రీటు జంగిల్‌గా మారిన నాగరిక నగరం తన ఆస్తిత్వాన్ని చాటుకుంటూ గ్రామంలా మారిపోతుంది. మాసమంతా పల్లె పడుచు అందాన్ని సంతరించుకుంటుంది. ఆనందంతో గంతులేస్తుంది. ఆషాఢ మేఘం ఆనందరాగమవుతుంది. తొలకరి పలకరిస్తుంది. పుడమి తల్లి పులకరిస్తుంది. ఆ పులకరింపుకు ప్రకృతి స్వరూపమైన అమ్మవారే కారణం. అందుకే అమ్మలగన్నయమ్మకు బోనాలు సమర్పించడం. బోనం అంటే భోజనం. ఆ నైవేద్యాన్ని స్వీకరించిన అమ్మవారు ఆశీస్సులిస్తుంది. అనురాగం కురిపిస్తుంది. ప్రజలందరిని చల్లగా చూస్తుంది. బోనాలంటే సామూహిక సంబరం. గ్రామమంతా పచ్చగా వుండాలని కోరుకునే నిస్వార్థపు పండుగదినం. అదొక నెల రోజుల పాటు వైభవంగా సాగే అపురూపమైన ఆనందపు ప్రవాహం. అంతకు మించిన జాతరలు. వేల ఏళ్ల తెలంగాణ గ్రామీణ సంస్కృతికి నిలువుటద్దాలు. కులాలకు అతీతంగా అందరూ ఆప్యాయంగా, అనురాగంగా చేసుకునేవే బోనాలు.

గోలకొండ కోటలో వెలిసిన జగదాంబకు బోనాలు సమర్పించుకోవడంతో తెలంగాణ బోనాలు మొదలవుతాయి. ఆషాఢ మాసపు మొదటి గురువారం బోనాలు ప్రారంభమవుతాయి. చివరి ఆదివారం వరకు ప్రతి రోజూ విశేష పూజలు జరుగుతాయి. వచ్చే గురువారం కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయ కమిటీ బోనాలను నైవేద్యంగా అర్పించుకుంటుంది. ఘటాలను సమర్పించుకుంటుంది.. ఆ తర్వాత వచ్చే ఆదివారం రోజున సామూహిక ఉత్సవం జరుగుతుంది.. కరోనా కారణంగా ఈసారి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునే అవకాశం ప్రజలకు లేకుండా పోయింది. మూడో ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాంకాళి ఆలయంలో బోనాల పండుగ జరుగుతుంది.. ఇక నాలుగో ఆదివారం లాల్‌దర్వాజలోని సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయంలో బోనాల సంబురాన్ని నిర్వహిస్తారు.

తెలంగాణ జాతి అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల సంప్రదాయం అతి ప్రాచీనం. తెలంగాణ ప్రజలు చేసుకునే ఏ పండుగలోనైనా, ఏ వేడుకలోనైనా పల్లె వాసన గుబాళిస్తుంది. పల్లెతనం అంతటా వ్యాపిస్తుంది. అణువణువునూ స్పృశించి ఆనందపరుస్తుంది. ఆప్యాయంగా పలకరిస్తుంది. ఏ పండగైనా పల్లెతో పంట పొలాలతో ప్రకృతితో మమేకమైనవే! రుతువులు మారిన కొద్ది వాతావరణం మారుతుంది. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలుతాయి. అవి దరిచేరకుండా వుండాలని అమ్మవారిని ప్రార్థించుకుంటారు. చల్లగా చూడమని బోనం సమర్పించుకుంటారు. అంతే కాదు ఖరీఫ్‌ సీజన్‌ మొదలయ్యేది కూడా ఇప్పుడే. వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని ప్రకృతికి అధిదేవతైన అమ్మను వేడుకుంటారు.

కాకతీయుల ఆధీనంలో గోలకొండ వున్నప్పట్నుంచే బోనాల సంబరాలు జరుగుతున్నాయనేది చారిత్రక సత్యం.ఆ తర్వాత గోలకొండను జయించి అధికారాన్ని చేపట్టిన కులీకుతుబ్‌ షా బాదుషాలు కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు.నెల రోజుల పాటు అధికారికంగా అంగరంగ వైభవంగా బోనాలు జరిపించేవారు…తానీషా ఆస్థానంలో మంత్రులైన అక్కన్న, మాదన్నల ఆధ్వర్యంలో గోల్కోండ కోట నుంచి షాలిబండలోని హరిబౌలి అమ్మవారి ఆలయం వరకు బోనాల ఉత్సవాలు జరిగేవి. అసఫ్‌జాహీలు కూడా బోనాలను నిర్వహించారు.1908లో మూసీనది ఉప్పొంగింది. ఆ వరద ప్రవాహంలో హైదరాబాద్‌ నగరం అతలాకుతలమైంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ప్రధాని మహారాజా కిషన్‌ ప్రసాద్‌ సూచన మేరకు నిజాం ప్రభువు మీర్‌ మహబూబ్‌ అలీఖాన్ లాల్‌దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు చేసి, చార్మినార్‌ దగ్గరకు చేరిన మూసీ నది నీటిలో సంప్రదాయ ప్రకారం పసుపు కుంకుమ, గాజులు, పట్టు వస్ర్తాలు సమర్పించి బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. కాకపోతే అది ఆషాఢం కాదు. అయినా అప్పట్నుంచే లాల్‌ దర్వాజా సింహవాహిని ఆలయంలో ఆషాఢమాసపు చివరి ఆదివారం బోనాల ఉత్సవాలను జరుపుతున్నారు.

ఆషాఢమాసంలో ప్రతి ఆదివారం తెలంగాణకు చెందిన వారి ప్రతి ఇంటా బోనం లేస్తుంది. అమ్మకు భోజనం పెట్టడానికి ఇంటిల్లిపాది ఆలయాలకు తరలివెళ్తారు. భిన్న సంస్కృతులతో భిన్న భాషలతో అలరారుతూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోన్న హైదరాబాద్‌ పాతబస్తీలోనే ఈ పండుగ సంబరం మొదలు కావడం విశేషం. హైదరాబాద్‌ వాడల్లో, వీధుల్లో వెలసిన అమ్మవారి గుళ్లన్నీ కొత్త రంగులు దిద్దుకుంటాయి. హంగులు సంతరించుకుంటాయి. కొత్త శోభను అద్దుకుంటాయి. విద్యుద్దీపాలతో ధగధగమనిమెరుస్తాయి. కొత్త బియ్యంతో వండిన భోజనాన్ని కొత్త కుండలో పెట్టి అమ్మవారికి సమర్పించుకుంటారు. పట్టు వస్ర్తాలు, పసుపుకుంకుమలను ఇచ్చి మొక్కకుంటారు. ఆషాఢంలో అత్తా అల్లుళ్లు ఒకే గడప దాటకూడదనేది శాస్ర్తం. కానీ తెలంగాణకు సంబంధించినంత వరకు కొత్త అల్లుళ్లకు ఇదే సంబరాలను తెచ్చే మాసం. అమ్మకు బోనాలను ఇవ్వడానికి కొత్త అల్లుళ్లు ప్రత్యేకంగా అత్తవారింటికి వస్తారు. తొట్టెల తీసుకువెళతారు. అసలు ఈ సంబరాలను చూడ్డానికి రెండు కళ్లు చాలవు. తెలంగాణలో గ్రామ దేవతలను పూజించే సంప్రదాయం అనాదిగా వస్తున్నది. గ్రామ పొలిమేరల్లో, చెరువు కట్టల దగ్గర అమ్మవారిని ప్రతిష్టించి పోలేరమ్మగా, కట్టమైసమ్మగా, గట్టు మైసమ్మగా పూజించే సంప్రదాయానికి శతాబ్దాల చరిత్ర వుంది.

ఒకప్పుడు పల్లెగా వున్న హైదరాబాద్‌ పట్టణంగా మారింది. ఆ తర్వాత నగరంగా రూపు దిద్దుకుంది. ఇప్పుడు కాస్మోపాలిటన్‌గా తయారైంది. అయినా ఇక్కడి ప్రజలకు గ్రామదేవతలపై నమ్మకం తగ్గలేదు. బోనాల పండుగ కళ తగ్గలేదు. మూలల్ని మరవకపోవడమంటే ఇదే! హైదరాబాద్‌…సికింద్రాబాద్‌లు ఇప్పుడు రూపురేఖలు మార్చుకున్నాయి.. కొత్త సొగసులు సంతరించుకున్నాయి. పచ్చదనాన్ని కోల్పోయాయి. చెరువులు దాంతో పాటే కట్టమైసమ్మలు అంతర్ధానమయ్యాయి. అనాదిగా వస్తూ వున్న కొన్ని పండుగలు ఉనికి కోల్పోయాయి. కొన్ని పండుగలు కొత్తగా వచ్చి చేరాయి. నగరాలు ఇంతగా మారినా భక్తి శ్రద్ధలతో నగరవాసులు జరుపుకుంటున్న ఏకైక పండుగ బోనాల పండుగ.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన