Telangana Weather Report: తెలంగాణ ప్రజలకు అలెర్ట్. రైతులు.. ఇక విత్తనాలు రెడీ చేసుకోవచ్చు. ఎందుకంటే వానల జోరు మొదలైంది. నైరుతి రుతుపవనాల(southwest monsoon) ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. మాన్సూన్ ఎఫెక్ట్ కారణంగా బుధ, గురువారాల్లో తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం తెలంగాణలో అక్కడక్కడ భారీగా, గురువారం ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రుతుపవనాలు రాష్ట్రంలో ఎంటరయిన సమయంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకూ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీవర్షాలు కురిశాయి. హైదరాబాద్(Hyderabad) సిటీలోని పలు ఏరియాల్లో వర్షం కురిసింది. నగర శివారులోని మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ ప్రాంతంలో అత్యధికంగా 9.1 సెంటీమీటర్లు వర్షం కురిసింది. చర్లపల్లిలో 9, కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 8.3, కుమురం భీం జిల్లా రవీంద్రనగర్ లో 7.7, ఖమ్మంలో 7.6, బాచుపల్లిలో 7.1, కీసరలో 6.2, సింగపూర్ టౌన్షిప్ వద్ద 5.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అయితే వానలు లేని ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. మంగళవారం అత్యధికంగా భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..